- తప్పిన పెను ప్రమాదం
- సురక్షితంగా బయటపడిన 12 మంది
ప్రజాశక్తి- మోతుగూడెం
అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం, మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధి మారేడుమిల్లి ఘాట్ రోడ్‌లో ఆదివారం తెల్లవారుజామున టాటా మ్యాజిక్ వాహనం బోల్తా పడింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... అనకాపల్లి జిల్లా మార్టూరు కోడూరు, లింగాపురం గ్రామాలకు చెందిన మల్లేష్, ఇ.వరాలమ్మ, జి.లీల, ఎ.కుమారి, ఆర్.లక్ష్మి, ఎ.మాధవరావు, బి.రఘు, ఎ.మనోజ్ కుమార్, ఆర్.హారిక, ఇ.భార్గవ్, ఎ.లక్ష్మీ ప్రసాద్ తదితర 11 మంది టాటా మ్యాజిక్ వాహనంలో భద్రాచలం సీతారాముల దర్శనానికి బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో కనకదుర్గ గుడి సమీపంలోని మలుపు వద్ద వాహనం అదుపుతప్పి 200 అడుగుల లోయలోకి బోల్తా పడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఇ.వరాలమ్మ, జి.లీల, ఎ.కుమారి, ఆర్.లక్ష్మి, ఎ.మాధవరావు, బి.రఘు, ఎ.మనోజ్ కుమార్, ఆర్.హారిక, ఇ.భార్గవ్, ఎ.లక్ష్మీ ప్రసాద్‌తో పాటు డ్రైవర్ వినోద్ ప్రమాదంలో గాయపడ్డారు. 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన 108 వాహనం వచ్చి క్షతగాత్రులను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. 12 మంది చిన్నచిన్న గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మోతుగూడెం పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










