ప్రజాశక్తి-మారేడుమిల్లి
మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో పాములేరు గ్రామ సమీపంలో మలుపు వద్ద పన్నెండు టైర్ల భారీ లారీ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విహార యాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో నలుగురు యువకులకు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు, మృతుల స్నేహితుల తెలిపిన వివరాలు ప్రకారం...
ప్రకాశం జిల్లా దర్శి గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు గురువారం పాపికొండలు విహార యాత్రకు వెళ్లారు. అనంతరం బస్సులో మారేడుమిల్లికి వచ్చారు. రాత్రి మారేడుమిల్లి క్యాపింన్ టెంట్ రిసార్ట్‌లో స్టే చేశారు. అనంతరం శుక్రవారం బస్సుతో జలతరంగిణి జలపాతానికి చేరుకుని, జలపాతాన్ని సందర్శించి అక్కడ నుంచి అమృతధార జలపాతానికి వెళ్లారు. అక్కడ నుంచి మారేడుమిల్లి తిరిగి రావడానికి వేచి చూస్తున్నారు. ఈ సమయంలో పౌరసరఫరాల బియ్యాన్ని చింతూరులో దింపి తిరిగి రాజమహేంద్రవరం వస్తున్న 12 టైర్ల భారీ లారీ ఆ మార్గంలో వస్తుండగా, దానిని ఆపి ఆరుగురు యువకులు ఎక్కారు. పాములేరు గ్రామ సమీపం వద్ద మలుపులో ఈ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్లను డీకొని సుమారు 80 అడుగుల లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో విహార యాత్రకు వచ్చిన పి.నారాయణ రెడ్డి (32), జి.సురేష్ (23) అక్కడిక్కడే మృతి చెందారు. నాగిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, పెద్దమాతా సుబ్బారెడ్డి, స్వామి, లారీ డ్రైవర్ గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మారేడుమిల్లి సీఐ శ్రీనివాసరావు, మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు రాము, జ్వాల సాగర్ సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకొని స్థానిక ప్రజల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. నాగ సురేష్ మృత దేహం లారీ ఎదుట భాగం కింద మట్టిలో కూరుకుపోయింది. లోయలో పడిపోవడంతో వెలికితీత చర్యలు చేపట్టారు. మృతులు పిచ్చెల నారాయణ రెడ్డి ఒడిశా రాష్ట్రం రామ్‌ంగపూర్లో రైల్యే స్టేషన్లో టీసీగా పనిచేస్తున్నారు. నాగ సురేష్ ఎంసీఏ చదువుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మారేకుమిల్లి పోలీసులు తెలిపారు.










