Aug 21,2023 00:10

పాడేరు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం వైజాగ్‌ నుంచి పాడేరు వెళ్తున్న ఆర్‌టిసి బస్సు లోయలో పడిపోయింది.38 మంది ప్రయాణిస్తున్న బస్‌ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
పాడేరు డిపోకు చెందిన తీష్ట్సాప్‌ బస్సు విశాఖపట్నం నుంచి పాడేరు వస్తుండగా, సాయంత్రం మూడున్నర గంటల సమయంలో ఘాటిలోని వ్యూపాయింట్‌ కు సమీపంలోని ఓ మలుపునకు ఎడమవైపు వేలాడుతున్న చెట్టు కొమ్మను ఢకొీనడంతో బస్సు కుడివైపున ఉన్న లోయలోకి పోయింది. ఈ ప్రమాదంలో పాడేరు మండలం బరిసింగి పంచాయతీ జి.కొత్తూరు గ్రామానికి చెందిన సీసా కొందన్న (52), సబ్బవరం మండలం సూరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నవర నారాయణ (55) మృతి చెందారు. ముంచంగిపుట్టు మండలం సరియాపుట్టు గ్రామానికి చెందిన కిల్లో బోద్‌ రాజుకు నడుములో ఎముకలు విరిగిపోగా, అదే మండలం చిప్పాపుట్లు గ్రామానికి చెందిన ఎస్‌.లక్ష్మికాంతంకు తలకు తీవ్రగాయం కాగా, నాతవరం మండలం డి.ఎర్రవరం గ్రామానికి చెందిన బుట్ట చిన్నామ్మలు, బస్‌ డ్రైవర్‌ కె.సత్తిబాబు తలపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు పాలైన ఈ నలుగురు బాధితులకు పాడేరు జిల్లా ఆస్పత్రిలో తరలించి ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్య సేవలకు విశాఖ కెజిహెచ్‌ కు తరలించారు. మిగిలిన క్షతగాత్రులకు పాడేరు జిల్లా ఆసుపత్రిలోనే వైద్య చికిత్సలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రెవెన్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.
ఘాట్‌ లో తుప్పలతో తిప్పలు
పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించే స్థానిక ఘాట్‌ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఎక్కడికక్కడ తుప్పలు అధికంగా ఉండడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలుపులు కనిపించని విధంగా ఉన్న ప్రాంతాల్లోని జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టాలని డ్రైవర్లు ప్రయాణికులు కోరుతున్నారు. కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో ఘాట్‌ మార్గంలోని ఇరువైపుల తుప్పలు విపరీతంగా పెరిగి పోయాయి. తుప్పలు పెద్దగా పెరిగి పోవడంతో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు అంటున్నారు. ఆయా మలుపుల వద్ద ఇరువైపులా తుప్పలు పెరిగి ఎదుటి వాహనాలు డ్రైవర్లకు కనిపించిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించని పరిస్థితిలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని డ్రైవర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు ఘాట్‌ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సంబంధిత అధికారులు జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టాలని వాహన చోదకులు ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులు స్పందించి పాడేరు ఘాట్‌ రోడ్‌ లోని జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టాలని వాన సదరులు ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.
ఘాట్‌ రోడ్డులో రక్షణ కరువు
పాడేరుటౌన్‌:పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించే స్థానిక ఘాట్‌ మార్గంలో రక్షణ కరువవుతోంది. ఘాట్‌ మార్గంలో రక్షణ గోడలు శిథిలమై ఏళ్లు గడుస్తున్నాయి. వాస్తవానికి ఎక్కడైనా ఘాట్‌ రోడ్లకు రక్షణ గోడలే ప్రధాన ఆధారం. కానీ వీటిపై అధికారులు దష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా కేంద్రం కావడంతో ఘాట్‌ మార్గంలో రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో స్థానిక ఘాట్‌ రక్షణపై ప్రభుత్వం దష్టి సారించాలని డిమాండ్‌ ఉత్పన్నమవుతున్నది. పాడేరు నుంచి చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలకు రాకపోకలు సాగించాలన్నా, ఆయా ప్రాంతాల నుంచి పాడేరుతో పాటు ఒడిస్సా రాష్ట్రానికి వెళ్లాలన్నా ఘాట్‌ ప్రయాణం తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ఘాట్‌ మార్గంలో రక్షణపై పాలకులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ప్రధానంగా ఘాట్‌ లోని వ్యూ పాయింట్‌ కు సమీపంలో, రాజాపురం వద్ద, ఏసు ప్రభు బొమ్మ మలుపులకు అటూ, ఇటూ, వంటల మామిడి నుంచి గరికిబంద వరకు ఉన్న మలుపుల్లో రక్షణ గోడలు శిథిలమై పోయాయి. పొరపాటున వాహనాలు అదుపు తప్పితే.. లోయలోకి దూసుకుపోవాల్సిందే. గతంలో నిర్మించిన రక్షణ గోడలు శిథిలం కాగా చాలా ఏళ్లుగా కొత్త రక్షణ గోడలు నిర్మించకపోవడంతో ఘాట్‌ ప్రయాణం భయం..భయంగానే ఉందని డ్రైవర్లు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.