ప్రజాశక్తి-మక్కువ : పార్వతీపురం మన్యంజిల్లా మక్కువ మండలం అనసభద్ర గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్ బుధవారం ఒడిశా ఘాట్‌రోడ్డులోని లోయలో పడిపోవడంతో వారంతా దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనం యొక్క పక్క స్టాండు తీయకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘట ఒడిశా ఘాట్‌రోడ్డులో జరిగింది.
దబ్బగడ్డగడ్డ పంచాయతీ అనసభద్ర గ్రామానికి చెందిన జన్ని బాలరాజు(21), మర్రి జయరాజు(22), మర్రి శివ (23) కలిసి ఒడిశా ప్రాంతానికి పని నిమిత్తం వెళ్లారు. బుధవారం సాయంత్రం తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బైక్ సైడ్‌స్టాండ్ తీయకుండా డ్రైవ్ చేస్తూ వస్తుండగా నారాయణపట్నం బ్లాక్ పరిధిలోని కేసలి సంత సమీపంలో బైక్ అదుపుతప్పి ముగ్గురూ లోయలో పడి మతి చెందారు. బాలరాజు గ్రామసచివాలయ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. మిగతా ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలపడంతో ఎస్‌ఐ పైడిరాజు మతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు.










