ప్రజాశక్తి -భీమునిపట్నం, ఆరిలోవ : శనివారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి జివిఎంసి ఒకటో జోన్ పరిధిలోనూ, మండలంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తగరపువలస జాతీయ రహదారి, సబ్బివీధి, అల్లూరి సీతారామరాజు కాలనీ, సర్వీస్ రోడ్డు, రామన్నపేట, భీమిలి క్రికెట్ మినీస్టేడియం ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షపు నీటి ప్రవాహానికి ఆయా లోతట్టు ప్రాంతాలు, చిన్నపాటి చెరువులను తలపించేలా ఉన్నాయి. వాహనాల రాకపోకలకు, నడిచి వెళ్లేందుకు వీలులేని పరిస్థితులు ఏర్పడ్డాయి. చిన్న పాటి వర్షానికీ లోతట్టు ప్రాంతాలు జలమయమయ మవుతుండడం, స్థానికులు అవస్థలు పడడం పరిపాటిగా మారింది. జాతీయ రహదారి వెంబడి డ్రెయిన్లు నిర్మించినప్పటికీ, వాటిని అవుట్ లెట్లతో అనుసంధానించలేదు.
వంతెనలపై నుంచి కిందకు వచ్చే వర్షపు నీరు వెళ్లే మార్గం లేక పోవడం, సంగివలస, చెరువు నీరు కూడా వర్షం నీటికి తోడుగా ప్రవహించడంతో సర్వీస్ రోడ్డు జలమయమైంది. జలమయమైన భీమిలి మినీ క్రికెట్ స్టేడియం ప్రాంతాన్ని జోనల్ కమిషనర్ ఎస్.వెంకటరమణ, తన సిబ్బందితో కలిసి పరిశీలించారు.
వర్షాలకు కూలిన ఇళ్లు
శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చిట్టివలస, భీమిలి - రెల్లివీధిలో రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి. చిట్టివలసకు చెందిన దారపు అప్పలనరసయ్యకు చెందిన పెంకుటిల్లు కూలింది. రెల్లివీధిలో నిమ్మకాయల నూకరాజు, పొట్లూరి పోలిరాజుకు చెందిన కమ్మల ఇళ్లు నీట మునిగాయి. దీంతో ఆయా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.
బాధిత కుటుంబాలకు పరామర్శ
బాధిత కుటుంబాలను, టిడిపి నగర కార్యదర్శి పిట్ట సురేష్‌తో పాటు స్థానిక నాయకులు ఆళ్ళ రామకృష్ణ, పి.రాజేష్ పరామర్శించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని జివిఎంసి, రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
హనుమంతవాకలో కూలిన ఇంటి గోడలు
ఆరిలోవ: గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హనుమంతువాక కొండవాలు ప్రాంతంలో ఆటో డ్రైవర్ జగన్నాధం రామిరెడ్డి ఇంటి గోడలు పూర్తిగా నాని శనివారం ఒక్కసారి కూలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టమేమీ జరగలేదు. ఇంట్లో సామగ్రి పూర్తిగా ధ్వంసం అయింది. సమాచారం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
ఆందోళనలో కొండవాలు ప్రజలు..
వర్షాలు పడితే కొండవాలు ప్రాంతాలైన హనుమంతువాక నుంచి దీనదయాల్‌పురం, రవీంద్రనగర్, బిఎన్‌ఆర్‌నగర్ ప్రాంతాల ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు తలచుకొని ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ ఏ బండరాయి ఏ ఇంటి మీద పడుతుందోనని, ఎత్తులో ఉన్న ఇళ్లు కింది ఇళ్ల మీద పడతాయని భయంతో జీవిస్తున్నారు. ఈ వర్షాలకు హనుమంతువాక కొండవాలు ప్రాంతంలో రాళ్ల గుట్టలు రహదారులపై పడడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.










