Sep 12,2023 23:30

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న బాధిత యువతి

ప్రజాశక్తి -పల్నాడు జిల్లా : లోను పేరుతో తనను లోబర్చుకోవాలని చూసిన చరిష్మ ఫైనాన్స్‌ యజమాని నరేంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరే మహిళకూ ఇటువంటి పరిస్థితి రాకూడని పట్టణంలోని సాయి నగర్‌కు చెందిన పావులూరి నాగలక్ష్మి ఆవేదన వెలిబుచ్చారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అదనపు ఎస్పీ రాఘవేంద్రకు ఆమె మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువతి మాట్లాడుతూ ఈ నెల 4న నరేంద్రను తాను లోనుకోసం సంప్రదించానని, సంబంధిత పత్రాలు తీసుకొని ఎన్జీవో కాలనీలోని కార్యాలయానికి రావాలని ఆయన చెప్పగా వెళ్లానని తెలిపారు. అయితే అది కార్యాలయం కాకుండా నివాసంలా ఉండటంతో భయపడుతూనే లోపలికి వెళ్లానని, వెళ్లగానే ఆయన తన చేతిని పట్టుకోవడంతో తాను ప్రతిఘటించి బయటికి వచ్చానని, పోలీసులకు ఫోన్‌ చేయడంతో వారు వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. అయితే నరేంద్రపై కేసు నమోదు చేయకుండానే విడిచిపెట్టారని, రాజీకి రావాలంటూ టూటౌన్‌సిఐ వీరేంద్ర ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై టూటౌన్‌ సిఐను వివరణ కోరగా రాజీ ఒత్తిడి ఆరోపణ నిజం కాదన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నామని, బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు.