Aug 30,2022 23:51

కేసు వివరాలు వెల్లడిస్తున్న సిపి శ్రీకాంత్‌

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : మొబైల్‌ ద్వారా రుణం ఇచ్చి లోన్‌ చెల్లించిన అనంతరం కూడా ఆమెను వేధిస్తున్న వ్యక్తిని నగర పోలీసులు అరెస్ట్‌ చేసారు. ఈ కేసు వివరాలను నగర పోలీస్‌ కమిషనర్‌ సిహెచ్‌.శ్రీకాంత్‌ మంగళవారం మీడియాకు వివరించారు. నగరంలో పెరుగుతున్న లోన్‌ యాప్‌ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌కు చెందిన జయ సింహా రెడ్డిని అరెస్ట్‌ చేసారని తెలిపారు. ఆ వ్యక్తి ఆరు నెలల క్రితం 11 ఫర్మ్‌ అకౌంట్లు ఓపెన్‌ చేసి చైనాకు చెందిన లోన్‌ యాప్‌ నిర్వాహకులకు అందజేసాడని, దానికిగాను అతడు రూ. కోటీ 15 లక్షలు కమిషన్‌ తీసుకున్నాడని తెలిపారు. ఈ 11 అకౌంట్లు ద్వారా ఆరు నెలల్లో సుమారు రూ.100 కోట్లు వ్యాపారం జరిగిందన్నారు. ఈ నగదును క్రిప్టో కరెన్సీ ద్వారా చైనాకు బదిలీ చేశారని, ఆ అకౌంట్లలో మిగిలిన కోటి రూపాయలను పోలీసులు సీజ్‌ చేశారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మే 17న నగరానికి చెందిన ఓ మహిళ రూ.5 వేలు లోన్‌ కోసం అప్లై చేయగా అదే రోజు ఆమె అకౌంట్‌కు రూ.3850 జమ చేశారని సిపి తెలిపారు. అనంతరం ఇచ్చిన గడువు మే 23లోపే ఆమె వద్ద నుంచి రెండు దఫాలుగా రూ.12 వేలు వసూలు చేశారని అన్నారు. అయినప్పటికీ ఆమెను అసభ్య పదజాలంతో వేధిస్తూ ఆమెకు న్యూడ్‌ ఫొటోలు పంపించి వేధించడం మొదలు పెట్టాడన్నారు. ఈ క్రమంలో ఆమె మే 24న సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా చైనాకు చెందిన కేవెన్‌ బాంగ్‌ను గుర్తించామని, అతడు చైనాలో ఉంటూ ఫేస్‌ బుక్‌ ద్వారా ఇక్కడి వారిని పరిచయం చేసుకుని ఇక్కడ వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ ముఠాకు సంబంధించిన వ్యక్తులు మారు పేర్లతో ఉత్తర భారత దేశంలో సిమ్‌ కార్డులు తీసుకుని వాటితో నేపాల్‌ సరిహద్దులో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఈ వ్యవహారాలు నడిపిస్తున్నారని, ఈ కేసు విచారణ మరింత ముందుకు సాగేందుకు కేంద్ర హోం శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని సిపి తెలిపారు.