May 21,2023 17:35

జూమ్‌ కాన్ఫరెన్స్‌ లో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ..

లోన్‌ యాప్‌లు, సైబర్‌ నేరాల పట్ల జాగ్రత్త
- ప్రజలను అప్రమత్తం చేయండి : ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       లోన్‌ యాప్‌ల మోసాలు, సైబర్‌ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం నంద్యాల జిల్లా కేంద్రంలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా డోన్‌ సబ్‌ డివిజన్‌ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్‌ స్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసులు, వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై సంబంధిత పోలీస్‌ అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలన్నారు. నిర్ణీత గడువులోపు పెండింగ్‌ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలని ఆదేశించారు. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్‌ అగైనెస్ట్‌ ఉమన్‌, గర్ల్‌ మిస్సింగ్‌, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సిఆర్‌పిసి తదితర కేసులను సమీక్షించారు. మిస్సింగ్‌ కేసులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించా లని త్వరితగతిన కనుగొనేలా చేయాలని ఆదేశించారు. అరెస్టులు, చార్జ్‌ షీట్లు, సమన్లు, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉంచకుండా చూసుకోవాలని, వాటికి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. నమోదైన కేసులలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి నేరస్తులు తప్పించుకునే వీలు లేకుండా న్యాయ స్థానాలలో తగిన సాక్షాధారాలు ప్రవేశపెట్టి శిక్ష పడేలా చార్జిషీట్‌ దాఖలు చేయాలన్నారు. హత్య, పోక్సో, రేప్‌ కేసులలో దర్యాప్తు వేగాన్ని పెంచాలన్నారు. మహిళల, చిన్నారుల అదృశ్యం కేసులలో అలసత్వం చూపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, తప్పిపోయిన వారిని పట్టుకొనడంలో నిబద్ధత చూపించాలన్నారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని దొంగిలించిన సొత్తును రికవరీ చేయాలన్నారు. బీట్లు, పికెట్స్‌ ఏర్పాటు చేసుకొని అధికారులు తరుచుగా బీట్‌ చెక్‌ చేస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వాలన్నారు. మట్కా, పేకాట, అక్రమ మద్యం రవాణాపై ముందస్తు సమాచారం సేకరించి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. దొంగతనాలను అరికట్టేందుకు హైవే రహదారులపై వాహనాల తనిఖీలు చేస్తూ ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. లారీ అసోసియేషన్‌ వారితో మాట్లాడి కంటైనర్‌ భారీ వాహనాలకు సిసి కెమరాలు ఏర్పాటు చేసుకోవాలని వివరించి అవగాహన కల్పించాలని, అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని పాపిలాన్‌ పరికరం ద్వారా వారి వేలి ముద్రలను తనిఖీ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుని ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ డిఎస్‌పి జె.వి.సంతోష్‌, సిఐ దస్తగిరిబాబు, డిస్ట్రిక్ట్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో సిఐ జయరాములు, ఎస్‌ఐలు అశోక్‌ ,రమేశ్‌ బాబు పాల్గొన్నారు.