May 16,2023 20:57

లోకేష్‌కు స్వాగతం పలుకుతున్న నాయకులు

ప్రజాశక్తి - బండి ఆత్మకూరు/నంద్యాల రూరల్‌
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర జన ప్రభంజనంతో జాతరను తలపించింది. బండి ఆత్మకూరులోని క్యాంప్‌ వద్ద నుంచి 101 వ రోజు మంగళవారం సాయంత్రం నారా లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించారు. మండలంలోని పార్నపల్లె, ఎ.కోడూరు గ్రామాల మీదుగా శ్రీశైలం నియోజకవర్గంలో యువనేత పూర్తి చేసుకుని నంద్యాల నియోజకవర్గంలోకి కొత్తపల్లె వద్ద ప్రవేశించింది. పాదయాత్రలో శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లోకేష్‌తో కలిసి ముందుకు నడిచారు. అడుగడుగునా మహిళలు హారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారి వెంట టిడిపి శ్రేణుల బాణసంచా మోత, డప్పు చప్పుళ్లతో యువగళం పాదయాత్ర హోరెత్తింది. అనంతరం కొత్తపల్లి వద్ద మాజీ మంత్రులు భూమా అఖిలప్రియ, ఎన్‌ఎమ్‌డి.ఫరూక్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జీ భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, ఎవి.సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు.
125 కుటుంబాలు టిడిపిలో చేరిక
బండి ఆత్మకూరు మండలంలోని పార్నపల్లి గ్రామానికి చెందిన వైసిపి ముఖ్య నాయకులు పలువురు టిడిపిలో చేరారు. యువ నేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళ పాదయాత్ర పార్నపల్లి గ్రామానికి చేరుకోగానే గ్రామానికి చెందిన మాజీ సర్పంచి నర్ల ప్రమీలమ్మ భర్త బుల్లెట్‌ రాఘవరెడ్డి, కాజీపేట మురళీధర్‌ రెడ్డిల ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన సుమారు 125 కుటుంబాలు నారా లోకేష్‌ సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. స్వయానా నారా లోకేష్‌ వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అవ్వకు లోకేష్‌ భరోసా...
పార్నపల్లి గ్రామం మీదుగా యువగళం పాదయాత్ర సాగుతుండగా దారిపక్కన షేక్‌ హుసేన్‌ బేగ్‌ అనే వృద్ధురాలు సైకిల్‌ పంక్చర్ల షాపు నడుపుతూ లోకేష్‌కు కనిపించారు. ఆమెతో లోకేష్‌ మాట్లాడారు. ఏడాది క్రితం కిడ్నీ సమస్యతో భర్త చనిపోవడంతో, గతంలో తాను నేర్చుకున్న సైకిల్‌ పంక్చర్లు ఇప్పుడు ఉపాధిగా మారిందని వివరిచారు. హజ్‌ యాత్రకి వెళ్లాలనేది జీవితకాల కోరిక అని, దాని కోసం తినీ తినక ఓ పదివేలు దాచుకున్నానని, హజ్‌ వెళ్లాలంటే లక్షలు ఖర్చవుతాయని తెలిసి, దాచుకున్న ఆ పది వేలతో పేద మహిళలకు చీరలు కొని పంచేశానని చెప్పారు. హజ్‌ యాత్రకు తన సొంత ఖర్చుతో పంపుతానని షేక్‌ హుసేన్‌ బేగ్‌కు లోకేష్‌ భరోసా ఇచ్చారు.