ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈనెల 31వ తేదీ రాత్రికి పల్నాడు జిల్లాలోకి ప్రవేశించనుంది. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలంలోకి లోకేశ్ పాదయాత్ర చేరుకుంటుంది. ఆగస్టు ఒకటి నుంచి పల్నాడు జిల్లాలో పాదయాత్ర ప్రారంభం అవుతుంది. వినుకొండ, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు మీదుగా గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. దాదాపు 15 రోజుల పాటు ఏడు నియోజకవర్గాల్లో యాత్ర అనంతరం ఆగస్టు 16 నాటికి ఎన్‌టిఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తారని టిడిపి వర్గాలు తెలిపాయి.
పల్నాడు జిల్లాలో తరచూ శాంతిభద్రతల సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో ఆయన పర్యటనలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా వినుకొండ, మాచర్ల, గురజాల తదితర నియోజక వర్గాల్లో వైసిపి టిడిపి ఢ అంటే ఢ అంటున్నాయి. గురు వారం వినుకొండలో తీవ్ర ఘర్షణ తలెత్తగా నియంత్రణ కోసం పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. వెంటనే తహశీల్దార్ 144 సెక్షన్ విధించారు. ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. తర్వాత దాన్ని తొలగిస్తారా? లేదా కొనసాగిస్తారా? అని రాజకీయ వర్గాల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. వినుకొండలో ఘర్షణలకు మీరే కారణం అంటే కారణం అంటూ వైసిపి, టిడిపి మధ్య రెండ్రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. గురువారం ఘర్షణకు సంబంధించి 150 మంది టిడిపి కార్యకర్తలపైపోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేశారు.
గతేడాది డిసెంబర్ 16వ తేదీన మాచర్లలో వైసిపి, టిడిపి మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెల్లరేగాయి. దాదాపు మూడు నెలల పాటు మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. టిడిపి కార్యకర్తలను పరామర్శించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ను కూడా రానివ్వకుండా శాంతిభద్రతల సమస్యను సాకుగా చెప్పారు. వినుకొండలో కూడా అదే రీతిలో లోకేశ్ పర్యటన అడ్డుకోవడానికి వైసిపి నాయకులు కుట్రలు చేస్తున్నారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. 144 సెక్షన్ పేరుతో లోకేశ్ పర్యటనను అడ్డుకుంటే టిడిపికి సానుకూలత వస్తుందని, అందువల్ల ఎత్తివేయడం మేలని కొంత మంది ప్రజా ప్రతినిధులు పోలీసు అధికారులకు సూచించినట్టు తెలిసింది. లోకేశ్ పర్యటనను సాగనిచ్చి ఆయన విమర్శలకు దీటైన జవాబు ఇవ్వడం మేలని వైసిపి ప్రజా ప్రతినిధులు యోచిస్తున్నారు. లోకేశ్ చేసే వ్యక్తిగత విమర్శలకు తగినరీతిలో జవాబు చెబుతామని సీనియర్ నాయకులంటున్నారు.










