ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
యువగళం పాదయాత్రలో టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చింతలపూడి ఎంఎల్‌ఎ ఎలిజాపై, సిఎం జగన్‌పైనా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసిపి నేతలు ఎంఎల్‌ఎ ఎలిజా ఆధ్వర్యంలో లోకేష్ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించి జంగారెడ్డిగూడెంలో నిరసన తెలిపారు. స్థానిక ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయం నుండి లోకేష్ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగిస్తూ గంగానమ్మ గుడి సెంటర్ వరకూ కొనసాగించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. వైసిపికి చెందిన కోవర్టులు అందించిన అసత్య సమాచారాన్ని కనీసం పరిశీలించకుండా అవినీతి ఆరోపణలు గుప్పించడం లోకేష్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎంఎల్‌ఎ ఎలిజా ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఎల్‌ఎ మాట్లాడుతూ కార్పొరేటర్‌గా కూడా గెలవలేని పిల్లకాకి లోకేష్ అవాకులు, చవాకులు, పేలడం మానుకుంటే మంచిదన్నారు. లోకేష్‌ది యువగళం పాదయాత్రా.. లేక రౌడీల యాత్రా అని ప్రశ్నించారు. సిఎం జగన్‌ను, మంత్రులను, ఎంఎల్‌ఎలను విమర్శించే అర్హత లోకేష్‌కు లేదన్నారు. పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామన్నారు. చింతలపూడిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణంలో ఉంటే కళ్లకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. దమ్ముంటే గతంలో ఉన్న టిడిపి మేనిఫెస్టోని బయటపెట్టాలని, కబుర్లు చెప్పడం మానుకుని నిబద్ధతగా ఉండాలని హితవు పలికారు. టిడిపి హయాంలో రోడ్ల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. పక్కనే టిడిపి ఇసుక దొంగలను పెట్టుకుని తమపై నిందలువేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొదమ జ్యోతి, మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జెడ్‌పిటిసి సభ్యులు పోల్నాటి బాబ్జీ, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










