ప్రజాశక్తి-ఆలూరు
నాయకులందరూ ఐక్యంగా ఉండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో జరిగిన సమావేశంలో చెప్పారు. ఎంత చెబుతున్నా ఆచరణలో మాత్రం నాయకుల మధ్య ఉన్న గ్రూపు పోరు పతాక స్థాయికి చేరి అధినేతలు వచ్చినా నాయకుల్లో మాత్రం ఐక్యత కనిపించడం లేదు. ఆలూరు టిడిపిలో గతంలో మూడు గ్రూపులుగా ఉండి ఈ పర్యటనలో రెండు గ్రూపులుగా దర్శనమిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన మాజీ ఇన్‌ఛార్జీ వైకుంఠం మల్లికార్జున చౌదరి పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఇన్‌ఛార్జీ వీరభద్ర గౌడ్, కప్పట్రాళ్ల బొజ్జమ్మ ఐక్యమయ్యారు. అధిష్టానం తమలో ఎవరికి సీటు ఇచ్చినా ఒకరికొకరు సహకరించుకోవడంతో పాటు కోట్ల సుజాతమ్మ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాలని ఒక మాటపై ఉన్నట్లు సమాచారం. తర్వాత కూడా ఆస్పరి మండలంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముగ్గురు కలిసి పర్యటించారు.
లోకేష్ పర్యటనలో ఫ్లెక్సీల రగడ...
ఆలూరు నియోజకవర్గంలో జరిగిన లోకేష్ పర్యటనలో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. దేవనకొండ మండలంలో వైకుంఠం బ్రదర్స్, డేగలపాడు నారాయణప్ప తదితరులు సొంతంగా వేసిన ఫ్లెక్సీ బ్యానర్లను కోట్ల గ్రూపు అడ్డుకొని చించేశారు. ఈ సంఘటన లోకేష్ దృష్టికి వచ్చినా, గ్రూపు విభేదాలు చూపుతున్న నేతలను ఫ్లెక్సీల్లో ఇన్‌ఛార్జీ ఫొటోలు లేకుండా ఎలా వేస్తారని, ప్రొటోకాల్ తప్పక పాటించాలని లోకేష్ తెలిపినట్లు తెలిసింది. ఆ వెంటనే కోట్ల సుజాతమ్మ స్టిక్కర్స్‌ను తమ ఫ్లెక్సీలపై అతికించారు. ఈ గ్రూపు సమస్యలను పరిష్కరించలేదని టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
విడివిడిగా జన సమీకరణ...
తమ నాయకుని పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ ఆయా మండలాల్లో పార్టీ కార్యాలయం నుంచి భారీ వాహనాల్లో జన సమీకరణ చేశారు. వీరభద్ర గౌడ్, మల్లికార్జున చౌదరి, బొజ్జమ్మ ఐక్యంగా వాహనాలు ఏర్పాటు చేసి జన సమీకరణ చేపట్టారు. వైకుంఠం శివప్రసాద్ కూడా సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసి జనాలను తరలించారు. ఈ వాహనాలపై ఏర్పాటు చేసిన స్టిక్కర్లలో తమ ఫొటోలు తప్ప టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ ఫొటో లేకపోవడం గమనార్హం. వైకుంఠం మల్లికార్జున చౌదరి, వీరభద్ర గౌడ్, బొజ్జమ్మ వివిధ పత్రికల్లో ఇచ్చిన యాడ్‌లలో కూడా ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ ఫొటో లేకుండా వేశారంటే విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.
గ్రూపు పోరు నివారణకు చర్యలు శూన్యం...
ఆలూరు టిడిపిలో దశాబ్దాల గ్రూపు పోరును నివారించడంలో అధినాయకత్వం విఫలమైంది. ఇందుకు మూల్యంగా రెండు దశాబ్దాలకుపైగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఓటమి చవిచూస్తూనే వస్తోంది. ప్రస్తుతం అధినాయకులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నా, వారి సాక్షిగానే గ్రూపు పోరు నడుస్తున్నా అధినాయకులు తీసుకున్న చర్యలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. ఈ విషయం టిడిపి అధిష్టానానికి ఎలా ఉన్నా ద్వితీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ప్రతి మండలంలో కూడా వైకుంఠం బ్రదర్స్, వీరభద్ర గౌడ్, కోట్ల సుజాతమ్మ గ్రూపులు కనిపిస్తున్నాయి. వారి వెంట నడుస్తున్న వారు భవిష్యత్తులో గ్రూపు పోరు నివారించకపోతే మరోసారి టిడిపి మూల్యం చెల్లించక తప్పదని పేర్కొంటున్నారు.










