Apr 21,2023 19:23

ఇరు గ్రూపులకు నచ్చచెబుతున్న డీఎస్పీ వినోద్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఆదోని
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. టిడిపి, వైసిపి గ్రూపుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు గ్రూపులు తీవ్ర పదజాలంతో దూషణలు చేసుకున్నాయి. పోలీసులు అతి కష్టం మీద ఇరు గ్రూపులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఆదోని నియోజకవర్గంలో శుక్రవారం టిడిపి ఇన్‌ఛార్జీ మీనాక్షినాయుడు ఆధ్వర్యంలో రెండో రోజు యువగళ పాదయాత్ర సాగింది. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మీదుగా పట్టణంలోకి భీమాస్‌ సర్కిల్‌లోకి లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రవేశించింది. యాత్ర రాగానే 'గో బ్యాక్‌' అంటూ వైసిపి కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతకుముందు వైసిపి నాయకులు దేవా, సురేష్‌, కిశోర్‌, దుర్గప్ప, లక్ష్మీనారాయణ, తాయన్న, కౌన్సిలర్‌ అశోక్‌, వసీం ఆధ్వర్యంలో ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్‌ రోడ్డులో కోట్ల విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అక్కడికి టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. టిడిపి కన్వీనర్‌ సజ్జత్‌ హుస్సేన్‌, తదితరులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోటాపోటీగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో తోపులాట చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇరు గ్రూపులను చెదరగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఏమాత్రం ఆదమరిచినా పరిస్థితి చేయి దాటి తీవ్ర ఘర్షణకు అవకాశం ఉండేది. టిడిపి, వైసిపి గ్రూపులు తీవ్ర పదజాలంతో ఒకరినొకరు దూషించుకున్నారు. డీఎస్పీ వినోద్‌ కుమార్‌, సిఐలు శ్రీరామ్‌, శ్రీనివాస్‌ నాయక్‌, ఈశ్వరయ్య, ఎస్‌ఐలు విజయలక్ష్మి చెదరగొట్టారు. వైసిపి గ్రూపును రాజశ్రీ హోటల్‌ వద్ద ఉంచారు. ఈ సందర్భంలో లోకేష్‌ పాదయాత్ర కోట్ల కూడలి మీదుగా మున్సిపల్‌ రోడ్డులో సాగుతుండగా వైసిపి నాయకులు పెద్ద రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి 'లోకేష్‌ గో బ్యాక్‌' అంటూ నినాదాలు చేయడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఈలలు, కేకలు వేయడంతో భయానక వాతావరణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డిపై భౌతిక దాడికి దిగారు. శ్రీనివాస్‌ రెడ్డి తప్పించుకునే ప్రయత్నంలో ఓ దుకాణంలో దాక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్న సందర్భంగా అధికార పార్టీ నాయకులు ఇలా నిరసన చేపట్టడం ఏమిటని పలువురు నిందించారు. నినాదాలు చేసుకుంటూ నారా లోకేష్‌ పాదయాత్ర ముందుకు సాగింది.

ఇరు గ్రూపులకు నచ్చచెబుతున్న డీఎస్పీ వినోద్‌ కుమార్‌