Aug 18,2023 00:53

ప్రజాశక్తి-తాడేపల్లి : టిడిపి జాయతీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తాడేపల్లిలో గురువారం నిర్వహించిన యువగళం పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలకడంతోపాటు తమ వినతులనూ ఇచ్చారు. లోకేష్‌ అందర్నీ పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ, ఫొటోలు దిగుతూ ముందుకు సాగారు. పాదయాత్ర ప్రారంభమైన వెంటనే వర్షం మొదలైనా లోకేష్‌ తన నడకను కొనసాగించారు. పట్టణంలోని డోలాస్‌నగర్‌, ప్రకాష్‌నగర్‌, నులకపేట, సాయిబాబా గుడి, ముగ్గురోడ్డు, వడ్డెరపాలెం, నెహ్రు బొమ్మ సెంటర్‌, గణేష్‌ కళా మందిరం, బోసు బొమ్మ సెంటర్‌ మీదుగా ఉండవల్లి సెంటర్‌, ఉండవల్లిలో పాదయాత్ర సాగింది. ప్రకాష్‌నగర్‌లో దళితులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్‌ విదేశీ విద్య కొనసాగించాలని, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని, సబ్‌ప్లాన్‌ నిధులను దళితుల సంక్షేమానికే ఉపయోగించాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, ఇళ్లస్థలాల సమస్యను పరిష్కరించాలని, బ్రహ్మానందపురంలో కారురాయిని అక్రమంగా తరలిస్తున్న వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కెసిపి సిమెంటు ఫ్యాక్టరీ సమస్య పరిష్కరించాలన్నారు. లోకేష్‌ స్పందిస్తూ తాము అధికారంలోకి వచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
పట్టణంలోని సలాం హోటల్‌ సెంటర్‌లో 60 ఏళ్లుగా రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న తమకు పట్టాలిచ్చే విధంగా న్యాయం చేయాలని స్థానికులు కోరారు. రెగ్యులర్‌ చేస్తామని హామీనిచ్చిన వైసిపి నాయకులు విస్మరించారని తెలిపారు. పట్టణంలో సుమారు 900 కుటుంబాలు రైల్వే స్థలాల్లో నివశిస్తున్నారని, వారందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయాలని, కృష్ణానది పక్కనే ఉన్న ఇసుక ధరలు మండిపోతున్నాయని, నిర్మాణ రంగంపై ఆ ప్రభావం పడిందని తెలిపారు. దీనిపై లోకేష్‌ స్పందిస్తూ అధికారంలోకి రాగానే ఇసుకను అందుబాటులోకి తెస్తామని, ఇళ్లస్థలాలు రెగ్యులైజ్‌ చేసి పట్టాలిస్తామని హామీనిచ్చారు. నెహ్రు బొమ్మ సెంటర్‌లో రైతులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం కాదని, తమ కష్టాలు పెరిగాయని, పంటలకు మద్దతు ధర లేదని, పసుపు పంట కల్లాల్లోనే తడిసి సరైన ధర రావడంలేదని, సిఎం ఇంటి సమీపంలో డబుల్‌ లైన్‌ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. దారి పొడవునా పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. రెండు మూడు సెంటర్లలో లోకేష్‌క గజమాలలతో స్వాగతం పలికారు.
రాష్ట్రంలో చేతగాని పాలన : లోకేష్‌
వివిధ సెంటర్లలో మాట్లాడుతూ జగన్‌ చేతకాని పాలన వల్ల రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రైతు సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామన్నారు. తాడేపల్లిలో డబుల్‌ లైన్‌ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిఒక్కరికీ పక్కా ఇల్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. సిమెంటు ఫ్యాక్టరీ బాధితుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమంగా క్వారీయింగ్‌ చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నారు. 45 ఏళ్లు నిండిన వారికి రూ.5 వేలు పింఛను మంజూరు చేస్తామన్నారు. వేట నిషేధ సమయంలో రూ.10 వేలు జీవనభృతి కల్పిస్తామని హామీనిచ్చారు. ఇంటి పట్టాల పేరుతో ఏడు వేల కోట్లు దోచుకున్నారని వైసిపిపై ఆరోపణలు సంధించారు. రన్నింగ్‌ రూమ్‌ల్‌ సెంటర్‌లో అధికంగా వస్తున్న కరెంటు బిల్లులపై ప్రజలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, నాయకులు పోతినేని శ్రీనివాసరావు, టిడిపి పట్టణ అధ్యక్షులు వి.వెంకట్రావు, జె.సాంబశివరావు, తెలుగు రైతు గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షులు కె.రాజశేఖరరెడ్డి, సిహెచ్‌.సుబ్బారావు, రూరల్‌ కార్యదర్శి ఎ.సుబ్బారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌ : వైసిపి నుండి కీలక నాయకులు టిడిపిలో చేరుతున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం డాన్‌ బాస్కో స్కూల్‌ వద్ద విడిది కేంద్రంలో పలువురు వైసిపికి చెందినవారు లోకేష్‌ సమక్షంలో టిడిపిలో చేరారు. వీరిలో నిడమర్రుకు చెందిన పాములపాటి వీరశివారెడ్డి, తాడేపల్లికి చెందిన సూరెడ్డి వెంకటరెడ్డి, కె.నాగేశ్వరావు, నవులూరుకు చెందిన ఏపూరి సురేష్‌ నాయుడు, పంచల సువార్త, వేమూరు ప్రణరు, యర్రబాలేనికి చెందిన దూళ్ల శేషు గోపయ్య, వీరితో పాటు మంగళగిరి పట్టణానికి చెందిన 13వార్డు, తాడేపల్లిలోని 2, 5, 7, 23వ వార్డులు, నవులూరు, కష్ణాయపాలెం,యర్రబాలెంకు చెందిన సుమారు 300పైగా కుటుంబాల వారు చేరినట్లు టిడిపి నాయకులు తెలిపారు.