ప్రజాశక్తి-అద్దంకి: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టే యువ గళం పాదయాత్రను విజయ వంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలు, ప్రజలను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కోరారు. ఈ సందర్భంగా స్థానిక నాగులపాడు రోడ్‌లోని కళ్యాణ మండపంలో శుక్రవారం టిడిపి నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించి లోకేష్ యువగళం పాదయాత్రలో చేపట్టవలసిన కార్యక్రమాలు చర్చించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ లోకేష్ యువ గళం పాదయాత్ర ఈ నెల 29వ తేదీ సాయంత్రం 3.00 గంటలకు నియోజకవర్గ పరిధి తిమ్మన్నపాలెం వస్తుందని, లోకేష్‌కు నియోజకవర్గం తరపున పెద్ద మొత్తంలో 6 వేల మంది మహిళలతో ఘన స్వాగతం పలికి, నియోజకవర్గంలోకి ఆహ్వానించడం జరుగుతుందన్నారు. అక్కడ నుంచి తిమ్మన్న పాలెం, మేదరమెట్ల, పైలాన్ మీదుగా బొడ్డువానిపాలెం, అద్దంకి లోకేష్ బస చేసే ప్రాంగణం వరకు పాదయాత్రకు జరుగుతుందని తెలిపారు. 30వ తేదీ ఆదివారం సాయంత్రం మరలా విడిది బస ప్రాంగణం నుంచి పాత బస్టాండ్ పొట్టి శ్రీ రాములు విగ్రహం వద్ద 50 వేల మందితో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. అనంతరం తిమ్మాయపాలెం నుంచి దర్శి నియోజకవర్గంలోకి వెళుతుందని తెలిపారు. కావున ఈ పాదయాత్రలో నియోజకవర్గ టిడిపి 5 మండలాల అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు జరిగింది ఒకెత్తు అయితే రేపు అద్దంకిలో జరిగే పాదయాత్ర ఒకెత్తు అని అన్నారు. ఈ భారీ బహిరంగ సభకు 50 వేల మంది హాజరవుతున్నారంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం లోకేష్ విడిది చేసే ప్రాంగణాన్ని పరిశీలించి నాయకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు, ఏఎంసి మాజీ చైర్మన్ నాగినేని రామకృష్ణ, పట్టణ, టిడిపి మండల అధ్యక్షులు చిన్ని లక్ష్మి శ్రీనివాసరావు, కే నాగేశ్వరరావు, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెంట్యాల రామాంజనేయులు, కాకాని అశోక్, కుందారపు రామారావు, కరి పరమేష్, దామా సురేంద్ర, లహరి, పునాటి విక్రమ్, మానం మురళీ మోహన్‌దాస్, గాస్ రవి, గోరంట్ల లక్ష్మణదాస్, నర్రా వీరయ్య, చాగంటి రాజేందర్, పరిటాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మేదరమెట్ల: రాష్ట్రంలో జరుగుతున్న యువగళం పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడైన నారా లోకేష్‌బాబు శనివారం మూడు గంటలకు అద్దంకి నియోజకవర్గంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఎక్కువ ప్రజలను సమీకరించి లోకేష్ బాబును ఘనంగా స్వాగతించాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండల టిడిపి నాయకులతో ఆయన శుక్రవారం చర్చించారు. లోకేష్‌బాబు ప్రవేశించే స్థలాన్ని పర్యవేక్షించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులను కోరారు. ఎటువంటి ఆటంకం లేకుండా పాదయాత్ర జరగటానికి తగు సూచనలను చేశారు. తిమ్మన్నపాలెం, మేదరమెట్లలో లోకేష్‌బాబు నడిచే ప్రదేశాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మాజీ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, చెన్నుపాటి హరిబాబు, మేదరమెట్ల శ్రీనివాసరావు, కర్నాటి పూర్ణచంద్రరావు, మన్నే ప్రసాద్, నేరెళ్ల శేషయ్య, వివిధ గ్రామాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










