Aug 19,2023 22:16

సమావేశంలో మాట్లాడుతున్న జ్ఞాన సువర్ణరాజు

* శాశ్వత లోక్‌అదాలత్‌ జడ్జి జ్ఞాన సువర్ణరాజు
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
శాశ్వత లోక్‌అదాలత్‌ ద్వారా సమగ్రమైన, సత్వర న్యాయం అందుతుందని శాశ్వత లోక్‌అదాలత్‌ జడ్జి జ్ఞాన సువర్ణరాజు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని లోక్‌అదాలత్‌ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో ప్రజా ప్రయోజిత సేవల అవగాహనా సదస్సును శనివారం నిర్వహించారు. ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజన సేవల్లో అవాంతరాలు ఎదురైనా శాశ్వత లోక్‌అదాలత్‌కు నేరుగా తెలియజేయవచ్చన్నారు. విద్య, వైద్యరంగాల సేవల్లో లోపాలు ఉంటే సకాలంలో ఫిర్యాదు చేయాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టం-1987 మేరకు 2006లో శాశ్వత లోక్‌అదాలత్‌లు ఏర్పాటయ్యాయని తెలిపారు. సమగ్ర, సత్వర తీర్పులు ఇవ్వడమే వీటి ప్రధాన లక్ష్యమన్నారు. త్వరలో మహిళా సంఘాల ప్రతినిధులతో శాశ్వత లోక్‌అదాలత్‌ పరిధిలోకి వచ్చే ప్రజా ప్రయోజన సేవలు వివరిస్తామని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి పి.మురళీకృష్ణ మాట్లాడుతూ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే వినతులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పొగిరి పిహెచ్‌సి వైద్యాధికారి జె.కృష్ణమోహన్‌, పలు శాఖల అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.