Oct 30,2023 01:01

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న వల్లభనాయుడు

ప్రజాశక్తి-ఉక్కునగరం : ప్రజలకు సత్వర న్యాయం చేయడమే శాశ్వత లోక్‌ అదాలత్‌ ప్రధాన లక్ష్యమని జిల్లా జడ్జి, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ జి.వల్లభనాయుడు అన్నారు. స్టీల్‌ సిఐటియు, శాశ్వత లోక్‌ అదాలత్‌ ఆధ్వర్యాన ఉక్కునగరం స్టీల్‌ సిఐటియు కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యవక్తగా జి.వల్లభనాయుడు మాట్లాడుతూ, ప్రజోపయోగ సేవకు సంబంధించి కోటి రూపాయలు విలువ మేరకు వివాదాలను పరిష్కరించే అధికారం లోక్‌ అదాలత్‌కు ఉందని వివరించారు. ప్రజా రవాణా, విద్యుత్‌, నీటి సరఫరా, పారిశుధ్యం లేక ప్రజా సంరక్షణ సేవ, భీమ, వైద్యశాల, బ్యాంక్‌ ఇతర ఆర్థిక లావాదేవీలు, విద్యాలయాలు, గృహము, స్థిరాస్థి సేవలకు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించిన వివాదాలను దీని ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఎటువంటి రుసుం చెల్లించకుండా న్యాయం పొందవచ్చన్నారు. ఇరుపక్షాల వారికి అంగీకారమైన తీర్పు వస్తుందని, దీనిని హైకోర్టులోనే మరలా ప్రశ్నించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. దీనిని ప్రజలు ఉపయోగించుకుని వివాదాలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాశ్వత లోక్‌ అదాలత్‌ సభ్యులు అబ్దుల్‌ అసరాప్‌, జి.సత్యనారాయణ, 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, స్టీల్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, అధ్యక్షులు వైటి దాస్‌, నాయకులు బిఎన్‌.మధుసూదన్‌, పి.శ్రీనివాసరాజు, బి.అప్పారావు, యు.వెంకటేశ్వర్లు, గంగాధర్‌, టివికె.రాజు, నీలకంఠం, మరిడయ్య, కృష్ణమూర్తి, సిహెచ్‌ వెంకటరావు, తౌడన్న, గురప్ప, కృష్ణారావు, వి.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.