May 13,2023 22:32

ప్రజాశక్తి - ఏలూరు
           ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 6475 కేసులు రాజీ చేశామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి జి.రామగోపాల్‌ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తమకుమార్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఈ అదాలత్‌ను నిర్వహించారమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో అవగాహన సదస్సును రామగోపాల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు వివిధ రకాల పద్ధతుల్లో లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను రాజీ చేస్తున్నామని, దీనిద్వారా డబ్బు, సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఇరుపక్షాలకు సమన్యాయం జరుగుతుందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 31 బెంచీలను ఏర్పాటు చేశామని, ఈ బెంచీల్లో 6475 కేసులు రాజీ చేశామన్నారు. వీటిలో 106 వాహన ప్రమాద కేసులు రాజీ చేయడం ద్వారా రూ.4,93,20,105, 115 సివిల్‌ కేసులను, 6038 క్రిమినల్‌ కేసులను పరిష్కరించామని తెలిపారు. అలాగే మున్సిపల్‌ టాక్స్‌ కేసులను, బ్యాంకు కేసులను, టెలిఫోన్‌ బిల్లుల కేసులను, ప్రీ లిటిగేషన్‌ కేసులు రాజీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శాశ్విత న్యాయ పీఠం ఛైర్మన్‌ ఎ.మేరీగ్రేస్‌ కుమారి, డిఎస్‌పి పైడేశ్వరరావు, ఏలూరు బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అభినేని విజయకుమార్‌, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు.
కైకలూరు:కేసుల పరిష్కారంలో రాజీమార్గం ఉత్తమమైనదని సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.షణ్ముఖరావు, జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.శ్రీనివాసులు అన్నారు. స్థానిక కోర్టు వద్ద శనివారం మెగా లోక్‌అదాలత్‌ నిర్వహించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మాడెం వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ అదాలత్‌లో పలుకేసులు రాజీ చేశారు. రాజీ వల్ల కక్షిదారుల విలువైన సమయం, ధనం వృధా కావని న్యాయమూర్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ఎస్‌.రాజు, జాయింట్‌ సెక్రెటరీ చావలి శంకర శాస్త్రి, లైబ్రరీ సెక్రటరీ కె.రమాదేవి, ఎపిపివి.శ్రీరామచంద్రమూర్తి, సీనియర్‌ న్యాయవాదులు గురజాడ ఉదరు శంకర్‌, టి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
భీమడోలు:భీమడోలు న్యాయస్థానం వేదికగా జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని శనివారం న్యాయస్థానం ఇన్‌ఛార్జి న్యాయమూర్తి సగబాల వాసుదేవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 270 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కారమయ్యాయని న్యాయస్థానం అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా నేర అంగీకారం కేసులు 27, భూ తగాదాలు 22, తొమ్మిది ప్రయివేట్‌ కేసులు, ఒక మనోవర్తి కేసు, 211 పెట్టీ కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. జరిమానాలు, ఇతర రూపాల్లో రూ.1,39,350 వచ్చాయని న్యాయస్థానం అధికారులు తెలిపారు.
చింతలపూడి : చింతలపూడి కోర్టులో శనివారం జరిగిన లోక్‌ అదాలత్‌లో 154 కేసులు రాజీ అయినట్లు చింతలపూడి జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి సి.మధుబాబు తెలిపారు. క్రిమినల్‌ కేసులు 30, ప్రోనోటు కేసు ఒకటి, చెక్‌బౌన్సు కేసులు తదితర కేసులు రాజీ అయ్యాయని తెలిపారు. 114 న్యూసెన్స్‌ కేసులు రాజీ చేసి కక్షిదారుల నుండి రూ.3,63,960 అపరాధ రుసుము వసూలు చేశామన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. చిన్నచిన్న తగాదా కేసులు రాజీపడి గ్రామాల్లో ప్రశాంతంగా జీవించాలన్నారు. ఏలూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.రత్నప్రసాద్‌, సభ్యులు డేవిడ్‌రాజు, న్యాయవాదులు నరుకుళ్ల సత్యనారాయణ, న్యాయవాదులు, సోషల్‌ వర్కర్‌ అక్బర్‌ అలీ, సిఐ మల్లేశ్వరరావు, పోలీస్‌ సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.