ప్రజాశక్తి-లీగల్ విలేకరి : జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ ద్వారా 18 వేలు కేసులు పరిష్కారమై రూ.20 కోట్లను కక్షిదారుకు అందజేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షులు జి.శ్రీదేవి తెలిపారు. విశాఖ జిల్లా కోర్టులోని న్యాయ సేవాసదన్‌లో లోక్ అదాలత్‌ను శనివారం ఆమె ప్రారంభించి ప్రసంగించారు. కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ మూడో స్థానంలో నిలిచిందన్నారు. లోక్ అదాలత్ తీర్పులు శాంతికి సుస్థిరంగా నిలుస్తాయని, కక్షిదారులు బేషజాలకు పోకుండా తమ కేసులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహాయంతో లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా కోర్టు ప్రాంగణాలలో జాతీయలోక్ అదాలత్ అట్టహాసంగా ప్రారంభమై అత్యధిక కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. కక్షిదారులు సమయాన్ని, ధనాన్ని ఆదా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి తిరుమలరావు, బార్ కౌన్సిల్ మెంబర్ బైపా అరుణ్‌కుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వైద్యుల రవీంద్రబాబు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కెకెవి.బులికృష్ణ పాల్గొన్నారు.










