Sep 09,2023 23:54

జాతీయ లోక్‌ అదాలత్‌ను పరిశీలిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గిరిధర్‌

ప్రజాశక్తి-యంత్రాంగం
విశాఖ లీగల్‌ :
విశాఖ జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 12,556 కేసులు పరిష్కారమయ్యాయి. విశాఖ జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ను మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఎస్‌.శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజీమార్గమే రాజమార్గమన్నారు. సమన్యాయం, శాశ్వత పరిష్కారం న్యాయ సేవ ప్రాధికార సంస్థ ద్వారా లభిస్తుందన్నారు. ఇరుపక్షాలు సంపూర్ణ ఫలాలను పొందడానికి ఈ అదాలత్‌ పనిచేస్తోందని తెలిపారు. బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, కార్మిక సమస్యలు, విడాకులకు సంబంధంలేని కుటుంబ న్యాయస్థానం కేసులు రాజీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రెండవ అదనపు న్యాయమూర్తి ఎం.వెంకటరమణ మాట్లాడుతూ, సత్వర, శాశ్వత న్యాయం పొందడానికి న్యాయ సేవ ప్రాధికార సంస్థ చక్కని మార్గం అన్నారు. న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎంవి.శేషమ్మ మాట్లాడుతూ, కేసుల రాజీకి ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 39 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం వరకు 12,556 కేసులు రాజీ అయినట్లు చెప్పారు.
గాజువాకలో...
గాజువాక : గాజువాక కోర్టు ప్రాంగణంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.శ్రీవిద్య, థర్డ్‌ ఎసిఎంఎం జడ్జి రాజేంద్రబాబు, 8వ ఎసిఎంఎం జడ్జి వై.శ్రీలక్ష్మి, జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రేమలత ఆధ్వర్యాన జాతీయ మెగా లోక్‌అదాలత్‌ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ శ్రీవిద్య మాట్లాడుతూ, రాజీ మార్గమే రాజ మార్గమని, అందరూ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కెవి.స్వామి మాట్లాడుతూ, లోక్‌ అదాలత్‌ను ఉపయోగించుకోవడం ద్వారా కాలం, ధనం, సమయం వృథా కాకుండా ఉంటాయని తెలిపారు. పలు కేసులలో కక్షిదారులు హాజరై వందల సంఖ్యలో పరిష్కరించుకున్నారు.