Mar 16,2023 23:54

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌పి సతీస్‌కుమార్‌

ప్రజాశక్తి-చింతూరు
చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం సుకుమార్‌ జిల్లా గాదిరాజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మరోకి గ్రామపంచాయతీలోని గాదెమ్‌ గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు మడకం భామన్‌ (22) గురువారం జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఎదుట లొంగిపోయారు. చింతూరులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్‌పి సతీష్‌కుమార్‌ కేసు వివరాలను వెల్లడించారు. భామన్‌ 2015 నుండి మావోయిస్టు పార్టీలో అనేక పదవుల్లో పనిచేసినట్లు తెలిపారు. 2018 మే నెలలో సోలార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మద్దెడు గ్రామ వద్ద జరిగిన బ్లాస్టింగ్‌లో ఏడుగురు చనిపోవటానికి కారణమయ్యాడని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు తెలుసుకొని, మావోయిస్టు పార్టీలో జరుగుతున్న వివక్షతకు వేసారి తన ముందు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు కల్పించే సౌకర్యాలను అన్నిటిని సకాలంలో కల్పిస్తామని, మావోయిస్టులు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఓఎస్‌డి కృష్ణ కాంత్‌, చింతూరు అడిషనల్‌ ఎస్పీ కేవీ మహేశ్వర్‌ రెడ్డి, సిఆర్పిఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ 42బి యన్‌ , చింతూరు, ఎటపాక సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.