Aug 05,2021 21:14
  • అక్టోబర్లో వెయ్యి గ్రామాల్లో..
  • డ్రోన్లు, రోవర్లు, కోర్‌స్టేషన్ల ద్వారా సర్వే

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామకంఠం పరిధిలో ఉంటున్నవారికి ఆగస్టు 15న 100 గ్రామాల్లోనూ, అక్టోబరు 2వ తేదీన మరో వెయ్యి గ్రామాల్లోనూ భూ యాజమాన్య హక్కులతో కూడిన కార్డులను జారీ చేయనున్నారు. సెక్రటేరియట్లో జరిగిన వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ధర్మాన కృష్ణ్దదాస్‌, బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర సర్వే, యాజమాన్య హక్కు కార్డుల జారీ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ పథకం కింద ఆగస్టు 15న హక్కు కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌, ఆర్‌ఒఆర్‌ చట్టాలకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ కూడా జారీచేసిందని గుర్తు చేశారు. 51 రెవెన్యూ మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి డ్రోన్లు, రోవర్లు, కోర్‌ సబ్‌ స్టేషన్ల ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రుల దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు తాడేపల్లిగూడెంలోనూ పైలెట్‌ ప్రాజెక్టుగా అర్బన్‌ పరిధిలోనూ సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 206 గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ జరుగుతోందని, 71 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతోందని వివరించారు. 762 గ్రామాలకు సంబంధించి విలేజ్‌ మ్యాపులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా స్వామిత్వ పథకం అమలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఆరు డ్రోన్లు కేటాయించారని, 51 డ్రోన్లు అవసరమవుతాయని మంత్రులకు అధికారులు వివరించారు. డ్రోన్‌ కార్పొరేషన్‌ ద్వారా అవసరమైన వాటిని ఏర్పాటు చేసుకోవాలని మంత్రులు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం, సిసిఎల్‌ఎ నీరబ్‌కుమార్‌ ప్రసాదు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి, పంచాయతీరాజ్‌ కమిషనరు గిరిజాశంకర్‌, సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌, పట్టణాభివృద్ధిశాఖ కమిషనరు ఎం.ఎం.నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.