పశు వైద్యాధికారి డాక్టర్ లీలారాణి
ప్రజాశక్తి -ఆనందపురం : పశువులకు సంక్రమించే ముద్ద చర్మవ్యాధి (లంపి వ్యాధి)పై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ ఎస్.లీలారాణి సూచించారు. పశువులను భయపెడుతున్న వ్యాధుల్లో లంపీ వ్యాధి ఒకటని, గ్రామీణ ప్రాంతాలలో అమ్మవారు వ్యాధిగా పిలుస్తారన్నారు. లంపీ వ్యాధి సోకిన పశువులు చర్మంపై బొబ్బూర్లు, కాళ్ల వాపులు వచ్చి పశువులు నిరసించిపోతాయన్నారు. ఇతర రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్ హర్యానా రాష్ట్రాలలో ఈ వ్యాధి సోకి సుమారు 50వేలు వరకు పశువులు మరణించినట్లు సమాచారం ఉందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ వ్యాధి ఎక్కువగా ఆవులకు వ్యాపించిందన్నారు. వ్యాధి సోకిన ఆవులకు చర్మమంతా బొబ్బర్లు, కాళ్లు చీము పట్టడం, విపరీతమైన జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఈ వ్యాధి నివారణకు మండలంలో ముందస్తుగా సుమారు ఏడువేల ఆవులకు వ్యాక్సినేషన్ చేశామన్నారు. గోట్ ఫాక్స్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ను ఈ వ్యాధికి ఇచ్చామన్నారు.
తీసుకున్న జాగ్రత్తలు
వ్యాధి సోకిన ఆవులను మిగిలిన వాటికి దూరంగా ఉంచాలన్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రస్తుతం శ్రీకాకుళం విజయనగరం ఇతర జిల్లాలలో చెక్‌పోస్టుల వద్ద ఆవులు రవాణాను నిలుపుదల చేశారన్నారు. గ్రామాలలో నిర్వహించే సంతలకు కూడా ఆపులను నియంత్రించారన్నారు. లంపీ వ్యాధిపై రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టి, పశువులకు వ్యాధి సోకితే వెంటనే స్థానిక పశు వైద్య కేంద్రానికి సమాచారం అందించాలన్నారు
నివారణ చర్యలు
వ్యాధి చొకిన ఆవులకు కాళ్ల నుంచి చీము వస్తే మూడు రోజుల పాటు పెన్సిలిన్ ఇంజిక్షన్ ఇస్తామన్నారు. అంతే కాకుండా ఆయుష్ శాఖ సలహా మేరకు ఇళ్లల్లో దొరికే మిరియాలు, తమలపాకులు, గళ్లఉప్పు నూరి గంట గంటకు పశువులకు పట్టాలన్నారు. వ్యాక్సిన్ వేసిన పది రోజుల్లో నయమవుతుందన్నారు. లక్షణాలున్న పశువులను గుర్తించి వెంటనే వ్యాక్సిన్ వేయించేలా రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు










