ప్రజాశక్తి-పద్మనాభం : మండలంలోని పలు గ్రామాల్లో పాడి పశువులకు లంపి చర్మ వ్యాధి లక్షణాలపై పాండ్రింగి పశువైద్యాధికారిణి ఆర్.అనుపమ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. పాండ్రింగి, గంధవరం, కొండ బర్లపేట గ్రామాల్లో 300 పశువులకు వ్యాక్సినేషన్ చేశారు. ఈ సందర్భంగా లంపి చర్మవ్యాధి లక్షణాలను రైతులకు వివరించారు. విపరీతమైన జ్వరం, మేత తినకపోవడం, ముక్కు, కళ్లు నుంచి నీరు, నోటి నుంచి చొంగలు కారడం, నీరసంగా పడుకోవడం వంటి లక్షణాలతో పశువుల బాధపడుతుంటే వెంటనే తగు వైద్యసేవలు అందించాలన్నారు. దోమలు, ఈగలు ద్వారా సరక్రమించే ఈ వ్యాధి, ఒక పశువు నుంచి మరో పశువునకు వ్యాప్తి చెందుతుందని, దీని నివారణకు ముందుగా టీకాలు వేయించుకోవచ్చన్నారు. వ్యాధి కారక క్రిములు శరీరంలోని చొరబడిన నాలుగు వారాల తర్వాత పాడిపశువుల చర్మంపై రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల వ్యాసంతో దద్దుర్లు ఏర్పడి, అవి క్రమంగా పుండుగా మారతాయన్నారు. చూడి పశువులకు వ్యాధి సోకితే గర్భస్రావమౌతుందని, అదే పాలిచ్చే పశువులకైతే పాల దిగుబడి తగ్గిపోతుందన్నారు. వ్యాధి సోకిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పాడిపశువులకు వైద్యం చేయించాలని సూచించారు.










