Apr 27,2023 01:42
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌బాషా

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: లంక గ్రామాల భూములకు అసైన్డ్‌ పట్టాలు ఇవ్వడానికి తహశీల్దార్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ వీక్షణ సమావేశం నిర్వహించారు. లంక గ్రామాల భూములను అనుభవిస్తున్న వారికి భూమిహక్కు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చెప్పారు. భూ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇందుకోసం సమగ్ర వివరాలను అసైన్డ్‌ కమిటీకి అందజేయాల్సి ఉందన్నారు. మే నెల 2వ తేదీలోగా స్పష్టమైన నివేదిక కలెక్టరేటుకు అందించాల న్నారు. రీసర్వేలో 2,200 మంది భూహక్కుదారుల ఫొటోలను అనుసంధానించలేకపోవడం ఏమిటని అధికారులను నిలదీశారు. వెబ్‌ ల్యాండింగ్‌లో సమగ్ర వివరాలు ఉండాలన్నారు. రెవెన్యూకు సంబంధించిన అర్జీలే స్పందనలో అధికంగా వస్తున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు సరిగా పనిచేయకపోవడంతోనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఫిర్యాదులకు తక్షణమే పరిష్కార మార్గం చూపాలని, అవగాహన లేకపోతే తెలుసుకోవాలని ఆయన సూచించారు. మినీ ఫిష్‌ రిటైల్‌ షాపులు 276 ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం కాగా ప్రస్తుతం 74 దుకాణాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ లక్ష్యాలను చేరుకోకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. నిజాంపట్నంలో 280 ఎకరాలలో ఆక్వా పార్కు ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. హార్బర్‌ కోసం 22 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా మార్గనిర్దేశం చేశారు. ప్రధానంగా ఎనిమిది అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. 200 మంది తీవ్రపోషణ లోపానికి గురై ప్రమాద స్థాయిలో అనారోగ్యంతో బాధపడుతుంటే పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. లబ్ధిదారులను ఒక్కొక్కరిని పర్యవేక్షించాలని ఆదేశించారు. వారికి అందుతున్న పోషణ, ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కలెక్టరేటుకు వివరాలు అందేలా ఆన్‌లైన్‌లో నివేదించాలన్నారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయన పలు సూచనలు చేశారు. సమావేశంలో డిఆర్‌ఓ కె లక్ష్మీశివజ్యోతి, ఆర్‌డిఓలు, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.