Jul 17,2023 00:16

సమావేశంలో మాట్లాడుతున్న బైరగాని శ్రీనివాసరావు

ప్రజాశక్తి - దుగ్గిరాల : అనేక సంవత్సరాలుగా లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు వెంటనే పట్టాలివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మండలంలోని పెదకొండూరులో లంక భూముల రైతుల సమావేశం దాసరి విజయలక్ష్మి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ లంక భూములు సాగు చేసుకుంటున్నా వారికి పట్టాలి ఇవ్వకపోవడంతో అనేకమందికి వారి భూములు ఆన్లైన్లో కనబడటం లేదని, పాస్‌ బుక్కులు పొందలేకపోయారని చెప్పారు. దీనివల్ల పంట రుణాలు పొందలేక వ్యవసాయంలో అధిక వడ్డీలకు ప్రైవేట్‌ రుణాలు తెచ్చుకొని చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామందికి ఈ-క్రాప్‌ బుకింగ్‌ కూడా చేయడం లేదని, ప్రభుత్వం కల్పించే రాయితీలకు, సబ్సిడీలకు దూరమయ్యారని తెలిపారు. లంక భూములు ప్రస్తుతం ఎవరు సాగు చేస్తున్నారో సర్వే చేసి వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షులు మన్నవ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ అనేక కష్టాలకోర్చి లంక భూములు సాగు చేసుకుంటున్నా వారికి రాయితీలు, ప్రోత్సాహకాలు, పథకాలు దక్కడం లేదని తెలిపారు. వెంటనే పట్టాలివ్వకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జె.బాలరాజు మాట్లాడుతూ దుగ్గిరాల మండలంలోని అనేక గ్రామాల్లో లంక భూముల రైతులు ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో కౌలురైతు సంఘం మండల అధ్యక్షులు బి.అమ్మిరెడ్డి, ఎం.గోపి, లంక భూముల రైతులు పి.నాంచారయ్య, పి.దయాసాగర్‌, వి.బాబు, ఆర్‌.పాములు, ఎం.పుట్లమ్మ, కె.వెంకటేశ్వరరావు, టి.సత్యనారాయణ పాల్గొన్నారు.