ప్రజాశక్తి - దుగ్గిరాల : పెద్ద కొండూరులో అనేక సంవత్సరాలుగా పేదలు సాగు చేసుకుంటున్న లంక భూములకు పట్టాలివ్వాలని కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ లంక భూములకు పట్టాలు ఇవ్వకపోవడంతో వారి భూములు, రైతులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదని, ఈ-క్రాప్ బుకింగ్ కూడా చేయడం లేదని చెప్పారు. పాస్‌బుక్‌లు లేని కారణంగా పంట రుణాలు, పంట నష్టపరిహారాలు, ఇతర వ్యవసాయ సబ్సిడీలు, రాయితీలు రైతులు పొందలేకపోతున్నారని తెలిపారు. దీంతో పెట్టుబడుల కోసం రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారని న్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జె.బాలరాజు, ఇ.అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సాగు చేసుకుంటున్న లంక, పోరంబోకు, బంజరు ఇతర భూములకు పట్టాలిస్తామని నిర్ణయం చేసిందని, దాన్ని వెంటనే అమలు చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న రైతులను సమీకరించి వారికి పట్టాలు వచ్చేదాకా పోరాడుతామన్నారు. ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ధర్నాలో కౌలురైతు సంఘం మండల కార్యదర్శి ఎం.నాగమల్లేశ్వరరావు, అధ్యక్షులు బి.అమ్మిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.విజయలక్ష్మి, రైతులు ఎం.పుట్లమ్మ, బి.సాంబయ్య, ఎ.వెంకటేశ్వరరావు, ఎం.సాంబశివరావు, ఆర్.రమేష్‌బాబు, ఎ.వేణు, నాంచారయ్య, వీర్రాజు పాల్గొన్నారు.










