Oct 05,2023 00:27

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : పారిశ్రామిక వేత్త తులసి రామచంద్రప్రభు నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగ ఆర్వో రవికుమార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఉదయ రంగా కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ కమిషనర్‌ చేకూరి కీర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్తి పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న తులసి కృష్ణ చైతన్య ఫైల్‌ పెండింగ్లో పెట్టి పేరు మార్పు చేయకపోవడంపై కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా వివిధ దశల్లో విచారణ చేశారు. ఫిర్యాదులోని అంశాలను నిజమేనని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో వీరిని సస్పెండ్‌ చేసినట్టు కమిషనర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఖాళీ స్థల పన్ను విధించకుండా అధికారుల ఆదేశాలను దిక్కరించి, జిఎంసికి రెవిన్యూ నష్టానికి కారణమయ్యారని డిప్యూటీ కమిషనర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త తులసి రామచంద్ర ప్రభు ఆస్తికి సంబంధించి పేరు మార్పునకు తులసి కృష్ణచైతన్య దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో రామచంద్ర ప్రభు నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకున్నారనే ఫిర్యాదులపై రెవెన్యూ ఏటుకూరు ప్రాంత రెవెన్యూ అధికారి కె.రవికుమార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కె.ఉదరు రంగాకుమార్‌ల దాదాపు రెరడు నెలలపాటు విచారణ చేశారు. చివరికి ఆరోపణలు నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకున్నారు. ఖాళీస్థలానికి మూడేళ్లుగా పన్ను చెల్లించకుండా కార్పొరేషన్‌ ఆదాయానికి రెవెన్యూ అధికారులు దాదాపు రూ.9 లక్షలు నష్టం చేకూర్చినట్టు గుర్తించిన కమిషనర్‌ రెవెన్యూ అధికారి కె.రవికుమార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కె.ఉదరు రంగా కుమార్‌కు గతనెలలో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వారిచ్చిన వివరణపై సంతృప్తి చెందకపోవడంతో సస్పెండ్‌ చేశారు.
గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోని ఏటూకూరులో తులసి రామచంద్ర ప్రభుకు 2710 గజాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో చిన్న ఇల్లు ఉంది. ఇందుకు సంబంధించిన ఆస్తిని తన కుమారుడు కృష్ణచైతన్య పేరుతో మొత్తం ఆస్తి విలువ రూ.5.42 కోట్లుగా నిర్ధారించి మొత్తం విలువలో 0.5 శాతం పన్ను చెల్లించాలని అధికారులు సూచించిన మేరకు 2021లో ఏటుకూరు సచివాలయంలో దరఖాస్తు చేసి రూ. 2.71 లక్షలు కార్పొరేషన్‌కు పన్ను చెల్లించారు. ఖాళీ స్థలాన్ని కూడా పన్ను చెల్లించకుండా తాము మ్యానేజ్‌ చేస్తామని నమ్మించి తన వద్ద రూ.3 లక్షలు లంచం తీసుకున్నట్టు ఉన్నతాధికారులకు రామచంద్ర ప్రభు ఫిర్యాదు చేశారు. 2710 గజాల స్థలంలో చిన్న ఇంటికి మాత్రం రూ.762 ఆస్తిపన్నుగా నిర్ధారించారు. రూ.3 లక్షలు లంచం తీసుకుని మొత్తం ఆస్తికి పేరు మార్చకుండా 2021లో గత కమిషనర్‌ చల్లా అనురాధ పేరుతో అప్పటి అదనపు కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి ప్రొసీడింగ్స్‌ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆన్‌లైన్‌లో మార్పు చేయకపోవడం వల్ల రామచంద్ర ప్రభు కుమారుడు కృష్ణ చైతన్య బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేయగా అసలు విషయం బయటపడింది.