Jul 26,2023 01:06
మాట్లాడుతున్న నరేంద్రవర్మ

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల ఎమ్మెల్యే ఇల్లే లంచాలకు నిలయంగా మారిందని బాపట్ల నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ ఆరోపించారు. మంగళవారం బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేంద్రవర్మ మాట్లాడారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అవినీతికి సంబంధించిన ఆధారాలు సైతం తమ వద్ద ఉన్నాయని అన్నారు. సోమవారం గుంటూరులో జరిగిన సభలో అవినీతికి మారుపేరుగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో లంచాలకు తావు లేకుండా చేశామని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో అన్ని శాఖల అధికారులు, పార్టీ నాయకులు కుమ్మక్కై ప్రతి పనికి ప్రజల ముక్కుపిండి లంచాలు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా అవినీతి ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడుస్తూ బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి నియోజకవర్గాన్ని అవినీతి కూపంగా మార్చిన ఘనత కోనకే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న రహదారులు, విద్యుత్‌, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు సంబంధిత శాఖలు సమన్వయంతో, అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయన్నారు. పట్టణంలో విద్యుత్‌ శాఖ స్తంభాలు ఉన్న చోటే డ్రైనేజీ కాలువలు తవ్వుతున్నారు. అధికారుల అవగాహనరాహిత్యానికి నిదర్శనం అన్నారు. పట్టణంలో జరిగే పనులను పర్యవేక్షించాల్సిన మునిసిపల్‌ కమిషనరు బాధ్యతలు మరచి ఎమ్మెల్యే సేవలో తరిస్తున్నారన్నారు. కోన రఘుపతి ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతూ సంపాదనే ధ్యేయంగా దోచుకుంటున్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొంటున్న అధికారులు స్వామి భక్తి చాటుకొంటున్నారన్నారు. ఇకపై రోజుకొక సమస్యపై బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుర్తించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని నరేంద్రవర్మ తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు తానికొండ దయబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపాల శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, నాయకులు ఫరీద్‌ మస్తాన్‌, వెంకట్రావు, అంద్రేయ, సూరగాని శేఖర్‌, పల్లం జీవన్‌ పాల్గొన్నారు.