ఉన్నావో నుంచి హత్రాస్ వరకు జరిగిన అనేక ఇతర సంఘటనలతో పాటు లఖింపూర్ ఘటన...ఉత్తరప్రదేశ్‌లో నేరాల రేటు పెరుగుతున్నదని రుజువు చేసింది. అంతేకాక, అలాంటి సంఘటనల పట్ల పాలనా వ్యవస్థ తీరును కూడా బట్టబయలు చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం, 2020లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక హత్య కేసులు (3779) నమోదయ్యాయి. ఇక్కడ చట్టం అమలు ప్రక్రియ తరచుగా వెనుక సీటులోనే ఉంటోంది. లఖింపూర్ ఘటనలో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను నిర్బంధం లోకి తీసుకునేందుకు కూడా ఉన్నత న్యాయస్థానం మందలించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఉత్తరప్రదేశ్ కు చెందిన లఖింపూర్ స్థానిక న్యాయస్థానం కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా బెయిల్ కోసం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ సంఘటనకు సంబంధించిన కొంతమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్బంధంలో ఉంచారు. రైతులు, జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగానే వాహనంతో గుద్ది వారి మరణానికి కారణం అయ్యారని, నిందితులే ఆ ఘటనకు కారకులన్నది ఆరోపణ. ఈ సంఘటన జరిగినప్పుడు తీసిన వీడియో దృశ్యాలను చూసి సామాన్య ప్రజానీకం అవాక్కయ్యారు. కొద్దిమంది బిజెపి కార్యకర్తలు కూడా చనిపోయారనేది విచారకరం. ఈ సంఘటన తరువాత...ఉత్తరప్రదేశ్ న్యాయశాఖా మంత్రి బ్రజేష్ పాఠక్ బిజెపి కార్యకర్తల కుటుంబాలను సందర్శించారు. కానీ, ఈ ఘటనలో ప్రాణాలను కోల్పోయిన అమాయక రైతుల కుటుంబాలను మాత్రం సందర్శించలేదు.
ప్రజల చేత ఎన్నికైన ఒక ప్రభుత్వం, దానిని నడిపించే మంత్రులు వారి రాజకీయ విశ్వాసాల పైన ఆధారపడి కాకుండా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. అటువంటి నైతికత తప్పనిసరి. రాజ్యాంగం ప్రకారం ఒక మంత్రి చేసే ప్రమాణంలోని ప్రతి అక్షరపు ఆత్మ అదే. స్వాతంత్య్రం సాధించిన తరువాత ఉత్సవాల సందర్భంగా దేశ ప్రథమ ప్రధాని, జవహర్ లాల్ నెహ్రూ మాట్లాడుతూ, ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినప్పటికీ, అది కాంగ్రెస్ పార్టీ నాయకుల నియంత్రణలో ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ విశిష్ట లక్షణం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ పాలక ప్రభుత్వానికి అన్వయించాలి.
కానీ ప్రజాస్వామ్య సంక్షోభ సమయంలో, అందరికీ ఆమోదయోగ్యమైన, ఇంత మంచి అంశం అస్పష్టంగా, కనపడకుండా కనుమరుగు అవుతున్నది. ప్రభుత్వం రాజకీయ పార్టీతో గుర్తించబడుతున్నది. అధ్వాన్నమైన విషయం ఏమిటంటే, ఆఖరికి రాజకీయ పార్టీలు కూడా ఒక వ్యక్తి స్థాయికి దిగజారి, వ్యక్తిని దేశానికి సమానం చేసి కీర్తిస్తాయి. 1975-77 ఎమర్జెన్సీకి ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు డి.కె. బారువా రూపొందించిన ''ఇండియానే ఇందిరా, ఇందిరే ఇండియా'' అనే నినాదాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ప్రస్తుతం దేశంలో రాజకీయ విగ్రహారాధన పునరావిర్భావం జరుగుతున్నది. ఇది, ఉత్తరప్రదేశ్‌లో న్యాయశాఖా మంత్రి వ్యవహరించిన విధంగా, క్యాబినెట్ మంత్రులు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించే పరిస్థితులకు దారితీస్తున్నది. ప్రజాస్వామ్య విలువలు దిగజారాయనడానికి ఇదొక సూచిక. 2014 ప్రారంభం నుండి కేంద్ర ప్రభుత్వం స్థిరంగా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, కార్యనిర్వాహక జవాబుదారీతనాన్ని కోరే వ్యవస్థలను ఒక క్రమపద్ధతిలో బలహీనపరిచే చర్యలను పెంచుతూ వస్తున్నదని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన తరుణభ్ ఖైతాన్ పేర్కొంటారు. ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాలలో ఖైతాన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ఇలాంటి ప్రజాస్వామిక అస్థిరత్వం యొక్క తీవ్ర ప్రభావాలు పైన తెలిపిన బిజెపి పాలిత రాష్ట్రాల్లో సమన్యాయ పాలనను పెకిలించివేయడంలో స్పష్టంగా వ్యక్తమయ్యాయి.
రాజ్యాంగ సిద్ధాంతాలకు భిన్నంగా చట్టాలను అమలు చేయాలన్న ఆలోచనలను లఖింపూర్ ఘటన వివరిస్తుంది. రాజకీయాలను నేరపూరితం చేయడాన్ని మించి అనేక విషయాలను మనకు ఈ సంఘటన తెలియజేస్తుంది. ''నేరపూరితమైన రాజకీయాలు పవిత్రమైన ప్రజాస్వామ్యానికి ఒక శాప''మని 2014లో మనోజ్ నరూలా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ నీతిని మరియు సుపరిపాలనను గురించి సదరు తీర్పులో న్యాయస్థానం నొక్కి వక్కాణించింది. ''ప్రజల విశ్వాసం అనేది సుపరిపాలనా భావాల మూలాల్లో దాగి ఉంటుంది. మంచి పాలన అంటే పౌర హక్కుల పట్ల గౌరవ భావం కలిగి ఉండడం. ప్రభుత్వ చర్యలలో ప్రాథమిక హక్కులు, చట్టబద్ధమైన హక్కులు, అలిఖిత రాజ్యాంగ విలువలు, వ్యవస్థల సమగ్రతను గౌరవించడం. జవాబుదారీతనాన్ని పెంపొందించడమ''ని పేర్కొంది.
ఉన్నావో నుంచి హత్రాస్ వరకు జరిగిన అనేక ఇతర సంఘటనలతో పాటు లఖింపూర్ ఘటన...ఉత్తరప్రదేశ్‌లో నేరాల రేటు పెరుగుతున్నదని రుజువు చేసింది. అంతేకాక, అలాంటి సంఘటనల పట్ల పాలనా వ్యవస్థ తీరును కూడా బట్టబయలు చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం, 2020లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక హత్య కేసులు (3779) నమోదయ్యాయి. ఇక్కడ చట్టం అమలు ప్రక్రియ తరచుగా వెనుక సీటులోనే ఉంటోంది. లఖింపూర్ ఘటనలో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను నిర్బంధం లోకి తీసుకునేందుకు కూడా ఉన్నత న్యాయస్థానం మందలించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఉత్తరప్రదేశ్ లోనే...విధులను నిర్వర్తిస్తున్న జర్నలిస్టులను అరెస్ట్ చేసి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణా చట్టం (ఉపా) లాంటి అనాగరిక చట్టాలను ప్రయోగించి, నిర్బంధంలో ఉంచారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలను వ్యక్తం చేస్తున్నవారు కూడా అదే విధమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా బూటకపు ఎన్‌కౌంటర్ మరణాలు, నిఘా పర్యవేక్షణలు మామూలైపోయాయి. ప్రజలు ఏదైనా ఆందోళన చేసేందుకు ఒకచోటుకు చేరే ప్రతీ సందర్భంలోనూ, వారు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న ముద్ర వేసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144వ సెక్షన్‌ను ప్రయోగిస్తున్నారు. 2020లో జాతీయ భద్రతా చట్టం కింద 139 మందిని జైళ్ళలో నిర్బంధిస్తే, వారిలో 76 మంది గోవధ చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న వారేనని సామాజిక కార్యకర్త హర్షమందిర్ పేర్కొన్నారు. 'లవ్ జీహాద్' ఆరోపణలు చేస్తూ అనేక జంటలను అరెస్ట్ చేశారు. హత్యలు, అత్యాచారాలు లాంటి నీచమైన నేరాలకు పాల్పడిన రాష్ట్రం వ్యక్తిగతమైన సాన్నిహిత్యాన్ని ఒక తీవ్రమైన నేరంగా ముద్ర వేయడానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంది. అధికారంలో ఉన్నవారి అవసరాలకు అనుగుణంగా చట్టాలను దుర్వినియోగం చేయడం లేదా అసలు చట్టాలను వినియోగించక పోవడం లేదా చట్టాలను పరిమితంగా ఉపయోగించడం నేటి ఉత్తరప్రదేశ్ కొత్త న్యాయ విధానం.
అస్సాం, త్రిపుర లాంటి రాష్ట్రాలు కూడా అదే విధానాన్ని అనుసరించాయి. అస్సాం లోని దారంగ్ జిల్లాలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి. వారిలో ఒకరి మృతదేహాన్ని ఓ ఫోటోగ్రాఫర్ తంతున్న వీడియో సమస్యాత్మక సమయాల్లో పరిస్థితిని తెలియజేస్తుంది. నిజమైన ప్రజాస్వామ్యం లేకపోతే మనిషికి గౌరవం ఉండదు. ''సమానమైన గౌరవం, సమానమైన ఆందోళన/బాధ'' సమ న్యాయ పాలన ముఖ్య లక్షణాలని న్యాయకోవిదుడు రోనాల్డ్ డ్వార్కిన్ అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నవి సర్వసమానత్వ భావనలో ఎంతమాత్రం బేరమాడడానికి వీలులేని దృక్కోణాలు.
న్యాయ నిపుణుడు, ఎ.వి.డైసీ వివరించినట్లు...రాజ్యాంగానికి లోబడి ఉండే ప్రజాస్వామ్యాలలో, సమ న్యాయ పాలన అధికార నిరంకుశత్వాన్ని తిరస్కరిస్తుంది. చట్టం నేడున్న రాజకీయాలకు మించి ఉన్నతంగా ఉండాలి. కానీ, ఉత్తరప్రదేశ్ నమూనాలో చట్టం రాజకీయ అధికారం చేతిలో కేవలం ఒక ఆయుధం మాత్రమే. లఖింపూర్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థల వైఫల్యాల గురించి...అనేక గ్రంథాలు రాయడానికి సరిపడా సమాచారాన్ని అందిస్తుంది.
'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' సౌజన్యంతో
(వ్యాసకర్త-సుప్రీంకోర్టు న్యాయవాది)











