Jun 28,2023 00:30

సమావేశంలో జిల్లా కలెక్టర్‌, పలు బ్యాంకుల ప్రతినిధులు

ప్రజాశక్తి - పల్నాడుజిల్లా కరస్పాండెంట్‌ : పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిర్దేశించిన ఆర్థిక రుణాల లక్ష్యాలను సాధించడానికి బ్యాంకర్లు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ కోరారు. మంగళవారం నిర్వహించిన డిఎల్‌ఆర్‌సి, డిసిసి సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగంగా బ్యాంకులు ఇస్తున్న రుణాలపై వివరాలు అడిగారు. వ్యవసాయ, గృహ నిర్మాణం, విద్యా రుణాలు, పిఎంఇజిపి రుణాలు, స్టాండప్‌ ఇండియా పథకానికి సంబంధించి రుణాలతో పాటు, కౌలు రైతులకు, రైతు మిత్రా గ్రూపులకు, స్వయం సహాయ సంఘాల గ్రూపులకు పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్‌ పథకం దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలను ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు అందించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు రుణాలను తప్పని సరిగా అందించాలన్నారు. సమావేశానికి హాజరవ్వని బ్యాంకులకు నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, డిసిసి కన్వీనర్లను కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో ఆర్‌బిఐ జిల్లా అధికారి నాగప్రవీణ్‌, నాబార్డు అధికారి పాల్గొన్నారు.