ప్రజాశక్తి-కె.కోటపాడు
2022 - 23 ఆర్థిక సంవత్సరంలో నూరు శాతం రిజిస్ట్రేషన్ల లక్ష్యాన్ని పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి జి.బాలకృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,585 కోట్లు లక్ష్యం నిర్దేశించగా, అక్టోబర్ నెలాఖరు నాటికి రూ.1646 కోట్లు ఆదాయం పొంది 66 శాతానికి చేరుకున్నట్లు చెప్పారు. కె.కోటపాడు సబ్ రిజిస్ట్రార్ పరిధిలో రూ.55 కోట్లు లక్ష్యం కాగా, నేటి వరకు రూ.32 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఈ సంవత్సరం స్టాంపులు కొరత రానివ్వకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రజలకు సేవలు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ సచివాలయాల వద్దే రిజిస్ట్రేషన్ల సౌకర్యం కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయన్నారు. ప్రజలకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ల రుసుములు పెంచే అధికారం కమిషనర్‌కు మాత్రమే ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ బంగారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.










