ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి : ఈ ఏడాది లక్ష్యానికి అనుగుణంగా ఖరీఫ్ పంట రుణాలు అందజేస్తున్నామని లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ఎ.శ్రీనివాసరావు తెలిపారు. సిసిఆర్‌సి కార్డులున్న కౌలుదారులకు రుణ సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 11,195 మందితో కూడిన సిసిఆర్‌సి కార్డుదారుల జాబితాను రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు తమకు అందజేశారని, వాటిని బ్యాంకు శాఖలకు ఇప్పటికే పంపామని వివరించారు. ఈ ఏడాది పిఎంఇజిపి పథకం కింద 121 యూనిట్లకు రూ.3.11 కోట్లు సబ్సిడీ పంపిణీ చేసినట్లు తెలిపారు. చిరువ్యాపారాలు, ఫుట్ ప్రాసెసింగ్ యూనిట్లకు బ్యాంకు రుణాలు పొందేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ వారం తనను కలిసిన 'ప్రజాశక్తి'కి ముఖాముఖీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు...
ఈ ఏడాది పంటరుణాల లక్ష్యం ఎంత, ఏ మేరకు అందజేశారు.?
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా పంట రుణాల లక్ష్యం రూ.3,432 కోట్లు కాగా, ఖరీఫ్‌లో రూ.2,025 కోట్లు, రబీలో రూ.1,407కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఖరీఫ్ రుణాలకు సంబంధించి జులై నెలాఖరు వరకు 1,525 కోట్ల (75శాతం) మేర రైతులకు పంపిణీ చేశాం. ఆగస్టు, సెప్టెంబర్ నెల రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు సుమారు 85 శాతంగా రుణసాయం అందినట్టుగా అంచనా. గత ఏడాది ఖరీఫ్‌లో రూ.2016 కోట్ల మేర ఇచ్చాం.
చిరువ్యాపారులకు సాయం అందించే పథకాలు ఏమైనా ఉన్నాయా.?
చిరువ్యాపారులతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కూడా వివిథ పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా చిరువ్యాపారుల కోసం పిఎం సన్నిధి పథకం ఉంది. ఈ పథకం కింద తొలి ఏడాది రూ.10 వేలు రెండో ఏడాది రూ.20 వేలు, మూడో ఏట రూ.30 వేలు చొప్పున ప్రభుత్వం తరపున బ్యాంకు రుణాలు పొందవచ్చు. వీటిని వాయిదాల పద్ధతిలో తీర్చితే ఆ తరువాత కూడా రుణసాయం పొందవచ్చు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 13,856 దరఖాస్తులు అందగా, 10,987 మందికి రుణసాయం అందించాం. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు పథకం పొందని వారికి మాత్రమే ఈ పథకం పొందేందుకు అవకాశం ఉంది.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఎంతమొత్తంలో రుణసాయం పొందవచ్చు.?
ప్రధాన మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ (పిఎంఎఫ్‌ఎంఇ) పథకం ద్వారా రుణసాయం పొందేందుకు అవకాశం ఉంది. లబ్ధిదారుడు పెట్టే యూనిట్‌ను బట్టి రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణం పొందేందుకు అవకాశం ఉంది. 35 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ వర్తిస్తుంది. ఈ పథకం కింద ఈ ఏడాది ఇప్పటి వరకు 166 యూనిట్లను మంజూరు చేయగా, 114 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి.
కౌలుదారులకు రుణసాయం అందుతుందా.?
బ్యాంకు నిబంధనలకు లోబడి కౌలుదారులందరికీ రుణసాయం అందజేసేందుకు చర్యలు తీసుకున్నాం. జిల్లా వాప్తంగా 11,195 మంది కౌలుదారులకు సిసిఆర్‌సి (క్రాఫ్ కల్టివేషన్ రైట్స్ కార్డు)లు అందజేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. వీరందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వాలని జిల్లాలో సుమారు 10 బ్యాంకులకు సూచించాం. వీటి పరిధిలోని బ్యాంకు శాఖల ద్వారా రైతులు ఆయా కార్డులు చూపించి రుణసాయం పొందవచ్చు.
పిఎంఇజిపి ద్వారా ఎంతమందికి, ఎంతమేర రుణసాయం అందించారు.?
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ఏడో తేదీ వరకు పిఎంఇజిపి ద్వారా 409 మందికి వివిధ రంగాల్లో ఉత్పత్తి, సేవారంగాల్లో ఉపాధి కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 121 యూనిట్లకు రూ.3.11 కోట్ల వరకు సబ్సిడీ విడుదల చేశాం. ఈ రుణసాయంలో పట్టణ ప్రాంతంలో 25 శాతం, గ్రామీణ ప్రాంతంలో 35 శాతం చొప్పున సబ్సిడీ వర్తిస్తుంది.
పిఎంఇజిపి ద్వారా ఎంత మేర రుణసాయం పొందవచ్చు.?
తయారీ రంగంలో రూ.50 లక్షలు, సేవారంగంలో రూ.20 లక్షల వరకు మంజూరు చేస్తారు. ప్రాజెక్టు వ్యయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలను బట్టి 25శాతం నుంచి 35శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. లబ్ధిదారుని వాటాగా 5నుంచి 10శాతం చెల్లించాలి. మిగిలిన మొత్తం వాయిదాల పద్ధతిలో బ్యాంకుకు కట్టాలి.
పిఎంఇజిపికి అర్హత ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
18 ఏళ్లు నిండిన వారంతా ఈ పథకానికి అర్హులే. వ్యక్తిగత ఆదాయ పరిమితి అంటూ లేదు. రూ.10 లక్షలకు పైగా పెట్టుబడిగల తయారీ రంగ పరిశ్రమలకు, రూ.5 లక్షలు దాటిన సేవారంగ పరిశ్రమలకు కనీస విద్యార్హత 8వ తరగతి. నూతనంగా ప్రారంభించిన పరిశ్రమలకు మాత్రమే ఈ పథకం ద్వారా సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.










