
పార్వతీపురం : పదో తరగతి ఉత్తీర్ణతలో గత ఏడాది మాదిరిగానే రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలను సాధించాలని, ప్రభుత్వశాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టరు నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరు కార్యాలయం నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖ, హౌసింగు, గ్రామీణ నీటి సరఫరా, రీసర్వే, ఓటరు నమోదు, బాల్యవివాహాలు, శిశుసంక్షేమశాఖ, గడపగడపకు మనప్రభుత్వం, ప్రాధాన్యతా భవనాలు నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖకు సంబంధించి టెన్త్‌లో ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. జలజీవన్ మిషను పనులను ఫిబ్రవరి నాటికి శతశాతం పూర్తిచేయాలని, పూర్తయిన పనుల సర్టిఫికెట్లను హర్ ఘర్ జల్ నందు పొందుపరచాలని తెలిపారు. జలజీవన్ మిషన్‌కు సంబంధించిన బిల్లులను చెల్లించడం జరిగిందని, పనులు పెండింగు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మూడో విడత రీసర్వే పనులు షెడ్యూలు ప్రకారం పూర్తిచేయాలని, ఫైనల్ ఆర్‌ఒఆర్ పూర్తయిన గ్రామాల్లో గల సిబ్బంది సేవలను మూడో విడత గ్రామాల్లో వినియోగించుకోవాలన్నారు. రీసర్వేలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని, ఫిర్యాదులు ఎక్కువగా వచ్చే గ్రామాల్లో ప్రత్యేక క్యాంపు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఓటరు సవరణకు సంబంధించి డిసెంబరు నాటికి మార్చులు, చేర్పులకు సంబంధించి ఆమోదం పొందిన దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు. ఎటువంటి లోపాలు లేకుండా ఫైనల్ లిస్టు తయారుచేయాలని, దానిపై ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. స్త్రీ, శిశు సంక్షేమానికి సంబంధించి రక్తహీనత, పౌష్టికాహర లోపాలను అరికట్టేందుకు సచివాలయం వారీగా రూపొందించిన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. గృహనిర్మాణాలకు సంబంధించి జగనన్న కాలనీలకు విలువైన స్థలాలను కేటాయించడం జరిగిందని, లబ్దిదారులు వెంటనే నిర్మాణాలు పూర్తిచేయాలని, లేఅవుట్లలో నిర్మాణాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు నీటి, రహదారి వసతి ఏర్పాట్లు చేయాలని గృహనిర్మాణ, ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పనులకు గానూ జిల్లాకు రూ.35 కోట్లు నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం రూ.9 కోట్లకు మాత్రమే పనులు ప్రతిపాదించాలని తెలిపారు. ప్రాధాన్యతా భవనాలను డిశంబరు 10వ తేదీనాటికి పూర్తిచేసి అప్పగించాలని తెలిపారు. సమావేశంలో జాయింటు కలెక్టరు ఆర్.గోవిందరావు, డిఆర్‌ఒ జె.వెంకటరావు, డ్వామా పీడీ కె. రామ చంద్రరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకరరావు, డిపిఒ బలివాడ సత్యనారాయణ, డిఇఒ ఎన్.ప్రేమ్ కుమార్, డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్‌కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టెన్త్‌లో ఉత్తమ ఉత్తీర్ణత ఫలితాలు సాధించాలి
పదో తరగతి ఉత్తీర్ణతలో గత ఏడాది మాదిరిగానే రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలను సాధించాలని కలెక్టరు నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరు కార్యాలయం నుండి ఎంఇఒలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాలను ఒక అధికారికి దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన అయిదు పాఠశాలలకు, పాఠశాల బాధ్యత తీసుకున్న అధికారికి రాష్ట్రస్థాయిలో అవార్డు, ప్రోత్సాహక బహుమతి అందిస్తామన్నారు. నూటికి నూరు శాతం ఫలితాలు సాధించటమే కాకుండా ప్రతిఒక్కరూ ఎనభై శాతం మార్కులకు పైగా సాధించేలా కృషి చేయాలని తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిఇఒను ఆదేశించారు. సైన్స్, ఇంగ్లీషు, గణితంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఉత్తీర్ణతా శాతమే కాకుండా, మంచి మార్కులు సాధించేలా విద్యావిధానం ఉండాలని, వారు పై చదువులకు వెళ్లునప్పుడు మంచి జ్ఞానం కలిగిన వారై ఉండాలని, వారిని ఆవిధంగా తీర్చి దిద్దాలన్నారు. కార్యక్రమంలో జాయింటు కలెక్టరు ఆర్.గోవిందరావు, డిఆర్‌ఒ జె.వెంకటరావు, డిఇఒ ఎన్.ప్రేమ్ కుమార్, మండల అధికారులు పాల్గొన్నారు.