Sep 19,2023 22:16

వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం :  చెప్పిన పని చెప్పినట్లు చేయకపోయినా.. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొకపోయినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి మున్సిపల్‌, మండల స్థాయి అధికారులను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ కె. మయూర్‌ అశోక్‌, ప్రత్యేక అధికారులతో కలిసి జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే, ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు ఇతర పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేను మరింత వేగవంతం చేయాలని, ప్రతి కుటుంబం నుంచి సేకరించిన వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతంలో 20 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోగా మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. భవిష్యత్తులో ఇవే వివరాల ఆధారంగా వైద్య చికిత్సలు ఉంటాయి కాబట్టి సర్వే విషయంలో అందరూ సీరియస్‌గా వ్యవహరించాలని పేర్కొన్నారు. రోజూ 40 కుటుంబాల వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకొనేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఫినిషింగ్‌ దశలో ఉన్న భవనాలను సెప్టెంబర్‌ ఆఖరు నాటికి పూర్తి చేసేయాలని సూచించారు. జగనన్న కాలనీల్లో చేపట్టిన నిర్మాణాల పూర్తికి సమిష్టి కృషి చేయాలన్నారు. డిసెంబర్‌ నాటికి ఎట్టిపరిస్థితుల్లో శతశాతం నిర్మాణాలు పూర్తి కావాల్సిందే అని పేర్కొన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా నమోదవుతున్న ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని ఆదేశించారు.
వంగర ఎంపిడిఒపై సీరియస్‌
ముందస్తు సమాచారం ఇవ్వకుండా సెలవుపై వెళ్లిన వంగర మండల ఎంపిడిఒపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. విసిలో భాగంగా ఆయనను పిలవగానే రెస్పాండ్‌ కాలేదు. ఇఒపిఆర్‌డి రెస్పాండ్‌ అయ్యి సెలవు పెట్టారని చెప్పగా... ఎవరికి చెప్పి సెలవు పెట్టారని ఘాటుగా స్పందించారు. వెంటనే వచ్చి జెడ్‌పిసిఇఒను, తనను కలవాలని ఆదేశించారు.సమావేశంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు దొర, వెంకటేశ్వర రావు, పద్మలత, ప్రత్యేక అధికారులు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.