Aug 16,2023 20:45

లక్షలాది రూపాయలు వెచ్చించి మత్స్యకారుల కోసం నిర్మించిన భవనాలు 15 సంవత్సరాలుగా నిరుపయోగంగానే ఉన్నాయి. ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరడం గమనార్హం. దీనిపై మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
నిరుపయోగంగా మత్స్యకార భవనాలు
ప్రజాశక్తి - మొగల్తూరు
మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌ ఏటిమొండి ప్రాంతంలో సుమారు పదిహేనేళ్ల కిందట రూ.96 లక్షలు వెచ్చించి మత్స్యకారులకు ఉపయోగపడేలా భవనాలు నిర్మించారు. ఉప్పుటేరు, సముద్రంలో వేటాడిన మత్స్య సంపదను ఎండబెట్టుకోవడానికి డ్రై ఫిష్‌ ప్లాట్‌ఫారం, వలల మరమ్మతులు, భద్రపర్చుకోవడానికి, మత్స్యకారులు విశ్రాంతి తీసుకునేందుకు భవనాలు నిర్మించారు. వాటికి విద్యుత్‌ సౌకర్యం సైతం ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన మార్గం నుంచి అంతర్గత రహదారులు, భవనాల చుట్టూ ప్రహరీ నిర్మించారు. అయితే గ్రామానికి, మత్స్యకారులకు దూరంగా ఉండటంతో వారు వీటి వినియోగంపై పెద్దగా ఆసక్తిచూపలేదు. దీనిపై దృష్టి సారించి మత్స్యకారులకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు కల్పించి అప్పగించాల్సిన అధికారగణం కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ భవనాలు వినియోగంలోకి రాలేదు. దీంతో ఆ భవనాల్లో విద్యుత్‌ ఉపకరణాలు, తలుపులు తదితర సామగ్రి అపహరణకు గురయ్యాయి. నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో ముళ్లచెట్లు పెరిగిపోయి అడవిగా మారింది. లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలను ఇప్పటికైనా మరమ్మతులు చేసి మత్స్యకారులకు అవసరమైన సౌకార్యలు కల్పించి వారికి అవగాహన కల్పించడం ద్వారా వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.