Nov 15,2023 21:50

ఫొటో : లక్ష దీపోత్సవం కరపత్రం ఆవిష్కరిస్తున్న వేమిరెడ్డి దంపతులు, ఇతరులు

లక్ష దీపోత్సవం కరపత్రం ఆవిష్కరణ
ప్రజాశక్తి-నెల్లూరు : వైసిపి జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టిటిడి ఢిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్‌ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు కార్తీకమాస లక్ష దీపోత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం కార్తీకమాస లక్షదీపోత్సవం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కార్తీకమాస లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో నెల్లూరు నగరంలోని విఆర్‌సి మైదానంలో ఈ కార్తీక మాస లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు.
లక్ష దీపోత్సవం సందర్భంగా మొదటి రోజు డిసెంబర్‌ 1న ఉదయం గణపతి పూజ, శ్రీ వైద్యనాథ్‌ మహాశివ లింగ ప్రతిష్ట, మహన్యాసపూర్వక శత రుద్రాభిషేకం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ సౌభాగ్య భువనేశ్వరీపీఠం పరమహంస రామానంద భారతి స్వామి వారి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం, మహాశివుని విశేష భస్మాభిషేకం, విశేష హారతులు జరుగుతాయన్నారు. 2వ తేదీన ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచ బిల్వార్చన, రుద్రహోమం, లక్ష్మీ కుబేర హోమం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానాధీశులు, శ్రీమత్పరమహంస పరవ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్చ శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం, శ్రీ కృష్ణ భగవాన్‌ నవనీత సేవ ఉంటాయని వివరించారు. మూడో రోజు డిసెంబర్‌ 3న ఉదయం ఛండీయాగం, శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వ్రతం, మధ్యాహ్నం విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అన్నదానం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ బుర్రా భాస్కర శర్మ ఆధ్వర్యంలో లక్షదీపోత్సం, శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున భక్తులందరూ ఈ లక్ష దీపోత్సవాన్ని విజయవంతం చేసి మహా శివుని కృపకు పాత్రులు కాగలరని ఆకాంక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కంజర్ల భాస్కర్‌ శర్మ, ఆమంచర్ల వెంకట ప్రభాకర్‌రావు, గంధం సునీల్‌ కుమార్‌, ఆశం విజయసారథి, వేద పండితులు గట్టుపల్లి పవన్‌కుమార్‌ శర్మ, మల్లిఖార్జున, తదితరులు పాల్గొన్నారు.