ప్రజాశక్తి -భీమునిపట్నం : మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్‌గా లచ్చుభుక్త జగదీశ్వరరావు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.రాజేష్ పట్నాయక్, ఎండిఒ పి.వెంకటరమణ తెలిపారు. సర్పంచ్ స్థానానికి ఈ నెల 19న ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ స్థానానికి నామినేషన్లు వేసిన లచ్చుభుక్త లక్ష్మి, బోని రమణ, కనకల సత్యనారాయణ, కరుభుక్త అప్పలరాజు, కరుభుక్త చందు సోమవారం తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో అనివార్యంగా వైసిపి బలపరిచిన లచ్చుభుక్త జగదీశ్వరరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ధ్రువ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.రాజేష్‌పట్నాయక్, ఎండిఒ పి.వెంకటరమణ అందజేశారు.
10వ వార్డు సభ్యునిగా పూసర్ల
టి.నగరపాలెం పంచాయితీ 10వ వార్డు సభ్యునిగా పూసర్ల రామారావు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ స్థానానికి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.రాజేష్‌పట్నాయక్, ఎండిఒ పి.వెంకటరమణ ధ్రువపత్రం అందజేశారు.
పలువురి అభినందనలు
లక్ష్మీపురం సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన లచ్చుభుక్త జగదీశ్వరరావును ఎండిఒ కార్యాలయం ప్రాంగణంలో సోమవారం పలువురు అభినందించారు. జెడ్‌పిటిసి సభ్యులు గాడు వెంకటప్పడు, వైస్ ఎంపిపి బోని బంగారునాయుడు, వైసిపి ఇంఛార్జి ముత్తంశెట్టి మహేష్, సింగనబంద సర్పంచ్ జివి.నారాయణ, ఎఎంసి చైర్మన్ యలమంచిలి సూర్య నారాయణ తదితరులు అభినందించిన వారిలో ఉన్నారు.
టి.నగరపాలెం పంచాయతీ 10వ వార్డు సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పూసర్ల రామారావును టిడిపి మండల అధ్యక్షులు డిఎఎన్.రాజు, తాళ్ళవలస ఎంపిటిసి సభ్యులు కోరాడ రమణ, మాజీ సర్పంచ్ పొట్నూరు రాము తదితరులు అభినందించారు.










