Apr 08,2023 23:46

పరీక్షిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి-గొలుగొండ:ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిందని కృష్ణదేవిపేట పిహెచ్‌సి వైద్యాధికారి హరిప్రవీణ్‌ అన్నారు. మండలంలో లింగంపేట గ్రామంలో శనివారం ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 161 మంది రోగులకు వైద్యాధికారి వైద్య పరీక్షలు నిర్వహించారు. 39 మంది రక్తపోటు, 17 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో మంచం బారిన పడిన ముగ్గురు వ్యాధిగ్రస్తులకు, 27 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అంగన్వాడీ కేంద్రం, ఎంపిపి పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తాగునీటిని క్లోరినైజేషన్‌ చేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం ఉమా, ఆశ కార్యకర్త అచ్చిపాప, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.