ప్రజాశక్తి- పాచిపెంట : పత్తి పంటలో వచ్చే కాయతొలుచు, ఆకు తినే పురుగులను లింగాకర్షక బుట్టలను ఉపయోగించి నియంత్రించవచ్చని, ఎకరానికి 7 నుండి 10 లింగాకర్షణ బుట్టలను పెట్టుకుంటే పురుగుల ఉధృతిని తెలుసుకోవడమే కాకుండా నియంత్రించవచ్చని మండల వ్యవసాయాధికారి కె.తిరుపతిరావు తెలిపారు. మండలంలోని అమ్మవలసలో విఎఎ మోహన్‌కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబడిలో మాట్లాడారు. నిరంతర పంటల విశ్లేషణ ద్వారా పంటల్లో ఉండే పురుగులు తెగుళ్లను గుర్తించడమే కాకుండా మిత్ర పురుగులను సైతం గుర్తించి వాటికి హాని జరగకుండా సమిష్టి నిర్ణయాన్ని తీసుకునేందుకు పొలంబడి ఉపయోగ పడుతుందని తెలిపారు. ఖర్చును తగ్గించి దిగుబడిని పెంచి పర్యావరణానికి హాని జరగకుండా నిరంతర విశ్లేషణ ద్వారా ఆరోగ్యవంతమైన పంటను పండించడంలో రైతునే సన్నద్ధం చేయడమే పొలంబడి లక్ష్యమని తెలిపారు. అనంతరం రైతులను సమూహాలుగా చేసి పంటలో గుర్తించిన చీడపీడలను, ఇతర వాతావరణ వివరాలు చార్ట్ పై బొమ్మలు గీసి చూపించారు. దీనిలో సీతాకోకచిలుక గ్రూపు మొదటి బహుమతి గెలుచుకోగా, కందిరీగ గ్రూపు రెండవ బహుమతి గెలుచుకుంది. కార్యక్రమంలో గ్రామ పెద్ద రేయి అప్పారావు ప్రకృతి సేద్యం ప్రతినిధులు యశోదమ్మ, బాలకృష్ణ, తిరుపతినాయుడు, ఐసిఆర్‌పిలు విజరు, సురేష్ పాల్గొన్నారు.
వెంకటాపురంలో పొలంబడి
సీతానగరం: మండలంలోని కె.వెంకటపురంలో పొలంబడి కార్యక్రమం గురువారం ఎఒ అవినాశ్ ఆధ్వర్యంలో జరిగింది. యాంత్రీకరణ విధానంలో వరి నాట్లు వేయడం వల్ల రైతులకు బహుళ ప్రయోజనాలన్నాయని తెలిపారు. ఈ పద్ధతిలో వరి నారును ముందుగా ట్రేల్లో పెంచుకొని 15-20 రోజుల నారును యంత్రశీలతో ఉండడం జరుగుతుందన్నారు. దీనికి ఎకరాకు 12 కేజీల విత్తనం సరిపోతుందన్నారు. దీని వల్ల రైతుకు ఉడుపు ఖర్చు సాధారణ పద్దతి కంటే ఎకరాకు రూ.1800 వరకు ఆదా అవుతుందన్నారు.
ఈ పద్ధతి వల్ల వరిలో కలుపుతీత, ఎరువులు వేయడం సులభతరమవుతుందన్నారు. పైరుకు గాలి, వెలుతురు బాగా తగిలి అధిక దిగుబడికి దోహదపడుతుందన్నారు. అలాగే పాస్పో బాక్టీరియల్ ఇనాక్యులెంట్ అయిన ద్రవరూప జీవన ఎరువు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కల్చరును సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో నాటిన వారం రోజుల్లోపు పొలంలో చల్లాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయధికారితో పాటు పొలంబడి రైతులు, గ్రామపెద్దలు, ఇతర రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.










