ప్రజాశక్తి-రేపల్లె: రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్ రిఫరెన్స్ లేకుండా స్కానింగ్‌లు చేయవద్దని, అవసరమైన గర్భిణులకు మాత్రమే స్కానింగ్ చేయాలని ఆర్డీవో జగన్నాథం పార్థసారథి చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పిసిపిఎన్‌డిటి యాక్ట్ కమిటీ మీటింగ్ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం అమలుపై సలహా మండలి సమావేశం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో జగన్నాథం పార్థసారథి మాట్లాడుతూ.. స్కానింగ్ చేసేటప్పుడు గర్భిణి అనుమతి తీసుకోవాలని, అనుమతి ఎట్టి పరిస్థితుల్లో కూడా లింగ నిర్ధారణ చేయవద్దన్నారు. ఈ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే డాక్టరుకు, చేయిస్తే ఆ కుటుంబ సభ్యులకు మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తారని చెప్పారు. వైద్యవృత్తి ఎంతో ఉన్నతమైనదని, మనిషి ప్రాణాలను కాపాడే మహత్తర అవకాశం దేవుడు వైద్యులకు, వైద్యశాఖలో పనిచేసే సిబ్బందికి కల్పించారని ఆయన అన్నారు. బాల బాలికలిద్దరూ సమానమేననే భావం కల్పించాలన్నారు. గర్భిణులు టెన్షన్ పడవద్దని, ఆరోగ్యం పట్ల, తీసుకోవాల్సిన మందులు, ఆహారం, విశ్రాంతి గురించి డాక్టర్లు మంచి సలహాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రోహిణి డీఎస్పీ మురళీకృష్ణ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ వసంతం వీర రాఘవయ్య, డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్ సుధాకర్, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.










