- ఆంధ్రా, ఒడిశా సరిహద్దు జిల్లాల వైద్యాధికారుల తీర్మానం
ప్రజాశక్తి - పర్లాకిమిడి: లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆంధ్రా, ఒడిశా సరిహద్దు జిల్లాల వైద్యాధికారులు నిర్ణయించారు. సరిహద్దు ప్రాంతాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు కాకుండా పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని తీర్మానించారు. పర్లాకిమిడిలోని సిడిఎంఒ ఛాంబర్‌లో సరిహద్దు జిల్లాల వైద్యాధికారుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, పలాస మండలాల్లో పురుషులు ఎక్కువ, స్త్రీలు తక్కువ ఉన్నారు కాబట్టి స్కానింగ్ చేసేటప్పుడు లింగ నిర్ధారణ చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాల పరిధిలోని సరిహద్దు ప్రాంతాల్లో గల స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టి తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. సరిహద్దు గ్రామాల్లో ఆరోగ్య విద్య, బాలికల ప్రాధాన్యత గురించి అవగాహనా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. లింగ నిర్ధారణ చేసిన స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడమే కాకుండా వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో సిడిఎంపిహెచ్ ప్రదీప్ కుమార్ పాత్రో, డిఎంఒ ప్రదీప్ కుమార్ పండా, పిసిపిఎన్‌డిటి కోఆర్డినేటర్ జగదీష్ పట్నాయక్, శ్రీకాకుళం జిల్లా ఎడిఎంహెచ్‌ఒ ఎన్.అనురాధ, డెమో పైడి వెంకటరమణ, డిప్యూటీ డెమో వెంకటేశ్వరరావు, పిసిపిఎన్‌డిటి కోఆర్డినేటర్ ఎస్.సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.










