Mar 04,2023 23:28

నిరసన తెలుపుతున్న అఖిలపక్ష నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి
తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీ అమ్మకానికి పెట్టేందుకు లిక్విడేటర్‌ను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్‌ తక్షణమే రాజీనామా చేయాలని అఖిలపక్ష ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. లిక్విడేటర్‌ నియామకానికి వ్యతిరేకంగా అఖిలపక్షాల ఆధ్వర్యాన తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీ మెయిన్‌ గేట్‌ ముందు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీపై 13,500 రైతు కుటుంబాలు, వందలాది కార్మిక కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా ప్రభుత్వం లిక్విడేటర్‌ను ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. సుగర్‌ ఫ్యాక్టరీ ఆధునికీకరణ తమతోనే సాధ్యమని 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్‌రెడ్డి, గుడివాడ అమర్నాథ్‌ పలుమార్లు ప్రకటించారని, నేడు అందుకు విరుద్ధంగా ఫ్యాక్టరీని విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. లిక్విడేటర్‌ నియామకాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు విల్లూరి పైడారావు, శ్రీరామదాసు గోవింద, దూలం గోపి, మల్ల శ్రీను, తాడి రామకృష్ణ, కనుబుడ్డి నరసింగరావు, అప్పికొండ గణేష్‌, దామోదర్‌, వైఎన్‌ భద్రం, కోరిబిల్లి శంకర్రావు, కోన దుర్గ, కనిశెట్టి సురేష్‌ బాబు, పవన్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.