ప్రజాశక్తి-దేవరాపల్లి
మండలంలోని చింతలపూడి రెవెన్యూ వీరభద్రపేట సమీపంలో 10 ఎకరాల అసైన్డ్ భూమి 99 సంవత్సరాలకు లీజు పేరుతో అన్యాక్రాంతమైందని, రెవెన్యూ అధికారులు ఆ భూమిని వెంటనే స్వాధీనం చేసుకొని లబ్ధిదారులకు తిరిగి అప్పగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ లబ్ధిదారులుగా ఉన్న స్థానిక గిరిజనులకు డబ్బు ఆశ చూపించి ఈ 10 ఎకరాల అసైన్డ్ భూమిని కె.కోటపాడు మండలం, గుల్లేపల్లికి చెందిన గొర్లె వెంకటలక్ష్మి పేరున 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారని తెలిపారు. ఆ భూమిని చదును చేసి పామాయిల్ తోట వేశారన్నారు. ఇక్కడ ఫారం-3 లేకుండా వ్యవసాయ మోటారు ఎలా వేశారని ప్రశ్నించారు. 9/77 యాక్టు ప్రకారం అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలు, లీజులు చెల్లుబాటు కావని, వీటికి భూ యాజమానులు లబ్ధిదారులైన గిరిజనులు అవుతారని, అలాంటప్పుడు లీజుదారు వెంకటలక్ష్మి పేరున విద్యుత్తు కనెక్షన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. విద్యుత్‌శాఖ అధికారులు భారీగా ముడుపులు తీసుకొని ఈ విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోందని విమర్శించారు.
వెంకటలక్ష్మి భర్త అయిన గొర్లె వెంకట అప్పారావు దేవరాపల్లి కో-ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్‌గా ఉన్నత ఉద్యోగంలో ఉన్నారని, చట్టంపై అవగాహన ఉన్న సదరు వ్యక్తి అసైన్డ్ చట్టాన్ని ఉల్లంగించి, తన భార్య పేరున భూమిని లీజకు తీసుకోవడమే కాకుండా విద్యుత్ కనెక్షన్ పొందటం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వెంకట అప్పారావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకున్న ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని ఇలా ఏళ్ల తరబడి లీజుల పేరుతో అడ్డగోలుగా అసైన్డ్ భూములను తమ సొంతం చేసుకుంటున్నారని తెలిపారు. తక్షణమే అసైన్‌మెంట్ భూముల బదలాయింపు నిషేధిత చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










