Feb 19,2021 07:11

రాజస్థాన్‌లో సెంచరీ కొట్టేసింది చూశావా?'' అంటూ గుర్నాథం వచ్చేడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి హెల్మెట్‌ తలకి తగిలించి బైటకొచ్చేడు అప్పారావు. బండీ స్టార్ట్‌ చేసి రోడ్డు మీదకి తెచ్చి అక్కడ ఇంజన్‌ని ఆపేసి హెల్మెట్‌ తీసి ఆకాశానికి అభివాదం చేశాడు. ఆ తర్వాత హెల్మెట్‌కి ముద్దు పెట్టేడు. రోడ్డు మీద నడుస్తూన్న జనాలకందరికీ తలవంచి అభివాదం చేశాడు. అప్పారావు నడిరోడ్డు మీద ట్రాఫిక్‌కి అడ్డంగా నిలబెట్టిన బండి చుట్టూ అప్పారావు, గుర్నాథం గెంతుకుంటూ ప్రదక్షిణాలు చేశారు. ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అందరూ చుట్టూ చేరి వింతగా చూస్తున్నారు.
వెంటనే అక్కడికి వచ్చేడు ట్రాఫిక్‌ కాన్‌స్టేబుల్‌ కొండలరావు. అతనికి ఏమీ బోధపడలేదు. ''ఏంటీ న్యూసెన్స్‌! ఎవరు మీరు? బండీ ఎందుకిలా నడిరోడ్డుమీద అడ్డంగా ఆపేశారు? తియ్యండి వెంటనే!'' అని గద్దించేరు. ఈ ఇద్దరూ గెంతులు ఆపలేదు. అప్పుడు జనాలు వాళ్ళిద్దరినీ ఆపి మళ్ళీ అడిగేరు ఎందుకిలా గెంతుతున్నారని.
''మీరెప్పుడూ క్రికెట్‌ మాచిల్లో కొహ్లీ సెంచరీ కొట్టడం చూడలేదా?'' అని అడిగేడు గుర్నాథం. ఆ విషయంలో జనాలు ఎప్పుడూ ముందే ఉన్నారు గనుక ముక్త కంఠంతో ''ఓ! చూడకేం? చాలాసార్లు చూశాం కదా? అయినా ఈ మధ్య కొహ్లీ ఉత్తుత్తినే ఔటయిపోతున్నాడే తప్ప సెంచరీ ఎప్పుడు కొట్టేడు? ఎక్కడ కొట్టేడు?'' అనడిగేరు. ''అదే మరి! ఈసారి మనం అందరం సెంచరీ కొట్టేశాం.'' అన్నాడు అప్పారావు. జనాలకిగాని, కానిస్టేబుల్‌ కొండలరావుకి కాని అర్ధం కాలేదు. '' అదేనండీ, పెట్రోలు ధర లీటరు సెంచరీ కొట్టేసింది.'' అనిగుర్నాథం వివరించబోయేడు.
''క్రికెట్‌ మైదానంలో చేయాల్సిన అల్లరి నడిరోడ్డు మీద ఇలా చేస్తే ఎలాగయ్యా? తియ్యండి! తియ్యండి! బండి వెంటనే తీసేయండి!'' అన్నాడు కొండలరావు.
''ఎక్కడ సెంచరీ కొడితే అక్కడే సెలిబ్రేట్‌ చెయ్యాలి కదా. మేం అదే చేస్తున్నాం. మీరు కూడా బండి వాడుతున్నారు కదా, మీరంతా కూడా సెలిబ్రేట్‌ చెయ్యాలి కదా?'' అన్నాడు అప్పారావు.
''మేం ఎక్కడ కొట్టేమండీ?'' అని చుట్టూ ఉన్న జనాలు అడిగేరు.
ఈ జనాలకి అర్ధం కాలేదని తెలిసిపోయింది అప్పారావుకి. ఎదురుగా బైక్‌ మీద కూచుని ఇదంతా చూస్తున్న ఓ శాల్తీని అడిగేడు. ''సార్‌! మీరు చెప్పండి, పెట్రోలు లీటరు ధర ఎంత?''
ఆ పెద్దమనిషి హెల్మెట్‌ తీసి మరీ బుర్ర గోక్కున్నాడు. చాలాసేపు ఆలోచించాడు. ఆ పక్కనే ఉన్న మరో వాహన చోదకుడిని అడిగేడు ''ఎంత సార్‌?'' అని. అతగాడూ చెప్పలేకపోయేడు. ఇలా ఒకరినొకరు అడుగుతూ చివరికి కొండలరావుని అడిగేరు అందరూ. అప్పటికే విసుగెత్తిపోయివున్నాడు కొండలరావు. ''అసలే ట్రాఫిక్‌ ఆగిపోయి నేనేడుస్తుంటే ఈ ప్రశ్నలేమిటి? అసలు మీకు బుద్ధుందా? ఎవరైనా పెట్రోలు ధర అడిగి పోయించుకుంటారా?'' అని అరిచేడు.
''పోనీ, మీరు ఏ లెక్కన పోయించుకుంటారు సార్‌? అనడిగేడు గుర్నాథం.
''గత పదేళ్ళుగా నేను బండి వాడుతున్నాను, ఎప్పుడూ 50, లేకపోతే వంద రూపాయల పెట్రోలు పొయ్యమని అడగడమే తప్ప ఈ లీటర్ల వ్యవహారం నా దగ్గర లేదు'' అన్నాడు కొండలరావు.
'మేమంతా కూడా అంతే' అన్నారు తక్కిన జనం. జనం అంతా తనవైపే ఉన్నారని గ్రహించిన కొండలరావు గర్వంగా తలాడించేడు.
''మరి మీ బండీ తక్కువ దూరం వస్తోందని ఎప్పుడూ చూసుకోలేదా? '' అనడిగేడు గుర్నాథం.
''ఎందుకు చూడలేదూ? బండీ తక్కువ దూరం వస్తోందని చూడగానే ఎక్కువ పెట్రోలు తాగేస్తోందని కనిపెట్టి బండీని అమ్మేసి కొత్తది కొన్నాగా? అటా ఈ పదేళ్ళలో ఇది అయిదో బండి'' అని తన వాహనాన్ని ముచ్చటగా చూపించేడు కొండలరావ్‌. తక్కిన జనాలలో కూడా చాలా మంది కొండలరావు మాదిరిగానే తలలాడించేరు.
''ఇప్పుడు అర్ధమైందిరా అప్పిగా? పెట్రోలు పోయించుకోడమే తప్ప లీటరు ధర ఎంత ఉందో, ధర పెరిగిందో తగ్గిందో ఎవడూ చూడడం లేదు. పైగా బండి ఎక్కువ పెట్రోలు తాగేస్తోందంటూ బండిని అమ్మేస్తున్నారు. అందుకే ఈ సెంచరీ ఆనందాన్ని మనతో పంచుకోలేకపోతున్నారు'' అన్నాడు గుర్నాథం.
''బాగా అర్ధం అయింది. పెట్రోలు ధరలు పెరుగుతూన్నా, వాహనాల అమ్మకాలు కూడా ఎందుకు పెరిగిపోతున్నాయో నాకు తెలిసిపోయింది.'' అంటూ అప్పారావు ఆనందపడలేకపోతున్న ఆ అభాగ్య జనాలని చూసి జాలిపడ్డాడు. ''ఈ సెంచరీ ఆనందాన్ని మనకు కలిగించిన మోడీ గారికి జై కొట్టండి'' అన్నాడు. వెంటనే జనాలు అక్కడినుండి చెల్లాచెదురుగా పరారీ అయిపోయేరు. మోడీ కున్న జన వికర్షక శక్తిని చూసి కొండలరావు తెగ ఆనందపడిపోయేడు. ఈలోపు అప్పారావు, గుర్నాథం అక్కడినుంచి జారుకున్నారు.
''హమ్మయ్య'' అని కొండలరావు అనుకుంటూండగానే అక్కడికి ఎర్రజెండాల గుంపు వచ్చి అటూ ఇటూ పోతున్న జనాలని ఆపి ''సోదరీ సోదరులారా! పెట్రోలు, డీజెల్‌, వంటగ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచిన కేంద్ర ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా రాస్తా రోకో చేస్తున్నాం'' అని ప్రకటించారు.
కమ్యూనిస్టులు ఎప్పుడూ నిజాలే చెప్తారు గనుక నిజంగానే పెట్రోలు ధరలు వంద రూసాయలు దాటేయని అక్కడ చేరిన జనం ఒప్పుకున్నారు.
పెట్రోలు ధర వంద దాటితే ఏం చెయాలో అప్పుడు అర్ధం అయింది అప్పారావుకి, గుర్నాథానికి. వాళ్ళూ ఆ గుంపుతో గొంతు కలిపి ''తగ్గించాలి పెట్రో ధరలు!'' అనడం మొదలెట్టారు.
సుబ్రమణ్యం