Jan 21,2023 22:27

ప్రజాశక్తి - ఏలూరు
            ప్రపంచంలో పుట్టిన ప్రతిమనిషి సమానమే, తన శ్రమకు తగ్గ ఫలితాన్నిపొందాలి, ఈ ప్రపంచంలో ఉన్న మానవవనరులన్నీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉన్నతమైన లక్ష్యంగా జీవించిన లెనిన్‌ జీవితం ధన్యమని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి తెలిపారు. స్థానిక పవర్‌పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో శనివారం లెనిన్‌ వర్థంతి సభ ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ శ్రమకు తగ్గ ఫలితం అందాలని, మానవ వనరులు అందరికీ అందుబాటులో ఉండే సమసమాజం ఈ ప్రపంచంలో ఉండాలనే సిద్ధాంతాన్ని రూపొందించిన కారల్‌ మార్క్స్‌, ఎంగెల్స్‌ ఆశయాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిన మహనీయుడు లెనిన్‌ అని తెలిపారు. లెనిన్‌ నాయకత్వాన రష్యాలో రాచరికాన్ని, పెట్టుబడిదారీవ్యవస్థను కూల్చి సమసమాజాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. అందరికీ విద్య, ఉద్యోగం, ఉపాధి, అన్ని అవకాశాలు అందరికీ అందించిన గొప్ప వ్యక్తి లెనిన్‌ అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఈ సిద్ధాంతం కోసమే పోరాటాలు చేస్తున్నారని, ఎప్పటికైన ఈ ప్రపంచానికి కమ్యూనిస్టు సిద్ధాంతమే ఉన్నతమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్యామలారాణి, కె.శ్రీనివాస్‌, పి.రామకృష్ణ, లెనిన్‌, ప్రసాద్‌, నారాయణరాజు, సీతారాం, షాజమా, ఇసాక్‌ పాల్గొన్నారు.