విశ్వనగరి హైదరాబాద్‌లో గత బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది వలస కార్మికులు బుగ్గిపాలయ్యారు. బీహార్ నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చిన ఆ అభాగ్యుల ఆఖరి మజిలిలో ఆనవాళ్లూ కూడా దొరకలేదు. వాళ్ళు చనిపోయిన సమాచారాన్నైనా ఆ కుటుంబ సభ్యులకు చేరవేయాలంటే ఆ వివరాలు ఎక్కడ నమోదయ్యాయి? వాళ్ళ భద్రతకి ఎవరు బాధ్యులు ? నష్ట పరిహారం చెల్లించాలన్నా ఆ పరిహారాన్ని క్లెయిమ్ చేయాల్సినది ఎవరు ? పోలీసు స్టేషన్లో ప్రమాదానికి బాధ్యులైనవారిపై కేసు బాధితుల తరఫున ఎవరు నమోదు చేయాలి? ఏ ఆధారమూ, కనీస సమాచారమూ ఎక్కడా నమోదు కాకుండానే వేలాదిమంది వలస కూలీలు వస్తున్నారు. ఇక్కడివాళ్ళూ పొరుగు రాష్ట్రాలకు పోతున్నారు. గతేడాది జులై నెలాఖరులో గుంటూరు జిల్లా రేపల్లె సమీపాన జరిగిన అగ్ని ప్రమాదంలోనూ ఇలాగే ఆరుగురు వలస కార్మికుల సజీవ దహనమయ్యారు. ఆ కష్టజీవులది ఒడిషా. కల్లోలిత కాశ్మీర్‌లో గతేడాది అక్టోబరులో భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు వలస జీవులు నేలకొరిగారు. వారిది బీహార్. వేరే దేశంలో మనవాళ్ళు ఉంటే, అక్కడ వారికి ఏ ఇబ్బంది వచ్చినా బాధ్యత వహించడానికి అక్కడి మన దేశపు ఎంబసీ ఉంటుంది. వాళ్ళ వివరాలు ఉంటాయి. ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం వస్తుంది. పత్రికల్లో వార్తలూ వస్తాయి. కాని మన దేశంలోనే, వేరే రాష్ట్రాలకు వలసపోయే కార్మికుల సమాచారం మాత్రం ఉండదు. వారి సంక్షేమం, భద్రత మన ప్రభుత్వాలకు పట్టదు.
తమ స్వస్థలాలను వదలిపెట్టి వీరంతా మరెక్కడికో వలసలు పోతున్నది ఉపాధి, మెరుగైన వేతనాలు దక్కుతాయనే. ఐతే ఈ వలసల కారణంగా అంతిమంగా శ్రమశక్తి విలువ కుంచించుకుపోతోంది. బీహార్ వాళ్లు ఇటొస్తే ఇక్కడ ఇచ్చే వేతనాల కన్నా తక్కువకే పని చేస్తారు. ఇక్కడివాళ్లు తమిళనాడు, కేరళకు వెళ్తారు.అక్కడ ఇచ్చే వేతనాలకన్నా తక్కువకే మనవాళ్ళు అక్కడ పనిలో కుదురుకుంటారు.అక్కడి వాళ్లు మహారాష్ట్రకో..గల్ఫ్‌కో వెళ్తారు. ప్రపంచమంతా వలసలు కొనసాగుతున్నాయి. తమ స్వస్థలంలో కన్నా వలసపోతే ఎక్కువ కూలీ వస్తుందని కూలీలు అనుకున్నా, మొత్తంగా చూస్తే అన్నిచోట్లా వేతనాలు తగ్గుతూ పోతాయి. యజమానులకే దీనివలన లాభం. పైగా ప్రతీచోటా ఈ వలసకూలీలు ఎవరికి వారుగానే, అసంఘటితంగానే, యూనియన్లకు దూరంగా ఉంటారు. అలా ఉన్నప్పుడే వారిని యజమానులు పనుల్లో పెట్టుకుంటారు.
సొంత రాష్ట్రాన్ని వీడి మరో రాష్ట్రానికి వలస వెళ్లి పనిచేస్తున్నవారు ఆరు కోట్ల మంది ఉంటారని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2016-17 పేర్కొంది. గుజరాత్‌లోని పోరుబందరు, వేర్వేల్ సముద్ర ప్రాంతానికి ఉత్తరాంధ్ర నుంచి మత్స్యకారులు ప్రతి ఏడాదీ పనులు కోసం వెళ్తుంటారు. మన రాష్ట్రంలోని పరవాడ పార్మా సిటీ, అచ్యుతాపురం సెజ్, రాంబిల్లి, నెల్లూరు జిల్లా ముత్తుకూరు క్లస్టర్, చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీ ఇలా ప్రతి జిల్లాల్లోనూ హిందీ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన శ్రమజీవులెందరో! వలస కార్మికులకు కనీసం తిండి, నివాసం, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం యజమానుల,ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చివుంటే హైదరాబాద్ లాంటి విషాద ఘటనలకు తావుండేదా? కోవిడ్ విపత్తు సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్దయగా వ్యవహరించిందో చూశాం. సుప్రీంకోర్టు చీవాట్లు సైతం ఆ ప్రభుత్వాన్ని కదల్చలేకపోయాయి.
ఇందుకు పూర్తి భిన్నంగా కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్) ప్రభుత్వం వలస జీవుల విషయంలో ఆదర్శనీయమైన కృషి చేస్తోంది. కోవిడ్ విపత్తులో వారిని 'అతిధులు'గా గౌరవించింది ఆదరించింది. సాధారణ పరిస్థితుల్లోనూ వలస కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, వసతి గృహాలు, ఆహారం, వైద్య సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా కేరళ వామపక్ష ప్రభుత్వం రోల్ మోడల్‌గా నిలిచి అంతర్జాతీయ సమాజ ప్రశంసలందుకుంది. సిఐటియు లాంటి కార్మిక సంఘాలు కోవిడ్ విపత్తు సమయాల్లో వలస జీవులను ఆదుకోవడంలో ప్రశంసించనీయమైన పాత్ర పోషించి మిగిలిన కార్మిక సంఘాలకు తాము భిన్నమని చాటుకున్నాయి. ఐతే అది సరిపోదు. వలసకార్మికులను సంఘటితం చేయడం ప్రజాతంత్ర ఉద్యమపు తక్షణ కర్తవ్యాలలో ఒకటిగా ఉండాలి. అప్పుడే కార్పొరేట్-అనుకూల దోపిడీ విధానాలకు చెక్ పెట్టగలం. ప్రభుత్వాల మెడలు వంచి వలసకార్మికుల సంక్షేమాన్నీ సాధించగలుగుతాం.










