ప్రజాశక్తి-చోడవరం
అధికారులు సూచించిన లెక్కల ప్రకారం ఉపాధి హామీ పనులు చేసినట్లయితే రోజుకు రూ.272 చొప్పున కూలి వస్తుందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి అన్నారు. మంగళవారం మండలంలో గంధవరం, అంబేరిపురం, గోవాడ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను, సమగ్ర భూ సర్వే పనులను పరిశీలించారు. గంధవరంలో పనులు చేస్తున్న కూలీలు తమకు కూలి గిట్టుబాటు కావడం లేదని కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ ఇటీవల ప్రభుత్వం ఉపాధి హామీ పనుల కూలి రేట్లు పెంచిందని, అధికారులు సూచించినట్లు చేస్తే కూలి గిట్టుబాటు అవుతుందని చెప్పారు. అంబేరిపురంలో రైతులతో కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ అధికారులు చేపడుతున్న భూ సర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు బి తిరుమల బాబు, ఇన్‌ఛార్జి ఎంపిడిఓ చైతన్య, సర్పంచ్ పల్ల నర్సింగరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.










