Jun 27,2023 00:48

మాట్లాడుతున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి -నర్సీపట్నంటౌన్‌:నాతవరం మండలం సుందరకోట పంచాయతీ బమిడికలొద్ది, అసనగిరి గ్రామాల అటవీ సరిహద్దు ప్రాంతంలో లేటరైట్‌ మైనింగ్‌ తవ్వకాలకు అనుమతులు రద్దు చేయాలని సిపిఎం నాయకులు అడిగర్ల రాజు డిమాండ్‌ చేశారు. సోమవారం స్పందనలో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, బినామి గిరిజనేతరడు జర్తా లక్ష్మణరావుకు మంజూరు చేసిన సుమారు 300ఎకరాల లేటరైట్‌ మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాలన్నారు. 5వ షెడ్యూల్డ్‌ ఏరియా చట్టం 1950 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రయోజనాలను రక్షించి గిరిజనులను కాపాడాలన్నారు. ఈ విషయమై జాయింట్‌ కమిటీ విచారణ నిమిత్తం బమీడికలొద్ది లెటర్‌ రైట్‌ ప్రాంతానికి ఈనెల 28న వస్తుందని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. భూమిని జర్తా లక్ష్మణరావుకు 20 ఏళ్ల కాల పరిమితి వరకు తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, వీటిని మించి రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలు చేపట్టి వందలాది చెట్లు తొలగించారని విమర్శించారు. ఆదివాసులు సాగు చేస్తున్న పోడుభూములు, అటవీ ప్రాంతాన్ని గ్యాప్‌ ఏరియా పేరుతో మైనింగ్‌ తవ్వకాలకు అనుమతి ఇచ్చారన్పారు. షెడ్యూల్‌ ప్రాంతంలో ఖనిజ తవ్వకాలు గిరిజనేతరులకు, బినామిలకు ఇవ్వడం చట్టవిరుద్ధమని, సరుగుడు ప్రాంతాల్లో లేట రైట్‌ ఖనిజ తవ్వకాలు చేపట్టడం నేరమన్నారు. ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపి విలువైన ఖనిజ సంపదను అక్రమంగా దోపిడి చేస్తున్న వారిని శిక్షించాలన్నారు. గిరిజన, అటవీ పర్యావరణ, ఖనిజ నియంత్రణ చట్టాలను ఉల్లంఘించిన అధికారులు, ప్రయివేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పీసా చట్టం ప్రకారం అసనగిరిలో గ్రామ సభ నిర్వహించకుండా మైనింగ్‌ తవ్వకాలు చేయడం నేరమన్నారు. మైనింగ్‌ ప్రాంతంలో సుమారు 10 కిలోమీటర్ల వరకు పోడు, సాగు భూమి కలుషితమవుతుందని తెలిపారు. ఇప్పటికైనా మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమలో సిపిఎం నాయకులు ఈరెల్లి చిరంజీవి, కెవీ సూర్యప్రభ పాల్గొన్నారు.