ప్రజాశక్తి- రేగిడి : కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేసి, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు అన్నారు. బుధవారం మండలంలోని సంకిలి ఈఐడి ప్యారి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మికు చట్టాలను లేబర్ కోడ్‌లుగా మార్చి దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలకు ప్రైవేట్ కంపెనీలకు కార్మికు వర్గాన్ని బానిసలుగా తయారు చేసేందుకు సిద్ధమవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపర భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్స్‌ను కేంద్రం సూచనలతో కోడ్స్‌కు అనుబంధంగా రూల్స్‌ను ప్రతిపాదించిందన్నారు. లేబర్ కోడ్స్‌ను ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. పిఎఫ్, ఇఎస్‌ఐ పథకాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చర్చకు పెట్టకుండానే నోటిఫికేషన్ ద్వారా మార్చే అధికారం తీసుకుందన్నారు. లేబర్ కోడ్స్ అమలైతే పారిశ్రామిక ప్రమాదాల్లో యజమానులకు ఏ బాధ్యత ఉండదన్నారు. కార్మికుల జీవితాలపై ఎంతో ప్రభావాన్ని కలిగించే ఈ రూల్స్ ప్రతులను కనీసం కార్మిక సంఘాలకు ఇవ్వకుండా ఏకపక్షంగా అమలు చేయాలనే దురాలోచన ఇందులో కనబడుతోందన్నారు. తక్షణమే గుర్తింపు పొందిన జాతీయ కార్మిక సంఘాలన్నింటితో సంయుక్త సమావేశానికి ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్, సతీష్, విఆర్‌సి నాయుడు, శ్రీనివాసరావు, దాలినాయుడు, రాంబాబు, వెంకటరమణ, సుధాకర్, గోవిందు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










